Washington, NOV 06: స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యల వల్ల అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఇద్దరు నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్‌మోర్ భూమికి తిరిగివచ్చేందుకు వచ్చే ఏడాది వరకు ఆగాల్సి వచ్చింది. జూన్ 5న వీరిని తీసుకెళ్లిన స్టార్‌లైనర్ ప్రొపల్షన్ వ్యవస్థలో తీవ్ర సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎక్కువ రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండటం వల్ల సునీత విలియమ్స్ అనారోగ్యానికి (Health Issues) గురయినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అందులో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి వెళ్లినట్లుగా కనిపిస్తున్నారు. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణుడు డాక్టర్ వినయ్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు.
Sunita Williams’ Health deteriorates
It looks like those two American astronauts stuck in the ISS are not in good health, especially Suni Williams.🤔 pic.twitter.com/0bO64DUXeu
— ShanghaiPanda (@thinking_panda) November 1, 2024
అంతరిక్షంలో ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. స్పేస్‌లో ఉన్నప్పుడు వ్యోమగాముల్లో ఎర్రరక్తకణాలు క్షీణించే స్థితినే స్పేస్ ఎనీమియా అంటారు. ‘మైక్రో-గ్రావిటీ’కి ఎక్కువ కాలం గురైనప్పుడు ఎర్రరక్తకణాల ఉత్పత్తితో పోలిస్తే అవి క్షీణించే రేటు వేగంగా ఉంటుంది. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు (Space Anemia) గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. దాంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. అలాగే గుండె పనితీరు దెబ్బతినే అవకాశమూ ఉంది.
8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సిఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.