TikTok logo (Photo Credits: IANS)

Washington, September 14: చైనీస్‌ వీడియో మేకింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఒరాకిల్‌ కార్పొరేషన్‌ రేసులోకి (TikTok Picks Oracle) వచ్చింది. టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డ్యాన్స్‌తో నిర్వహించిన చర్చలు ఫలప్రదంకాలేదని మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తాజాగా వెల్లడించింది.ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగాన్ని దక్కించుకునేందుకు ఐటీ కంపెనీ ఒరాకిల్‌ (Oracle) పావులు కదుపుతున్నట్లు విదేశీ మీడియా పేర్కొంది.

ఇటీవల టిక్‌టాక్‌ యూఎస్‌ కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు వాల్‌మార్ట్‌తో జత కట్టిన ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ చర్చలు నిర్వహించింది. అయితే అమెరికాలోని (United States) టిక్‌టాక్ కార్యకలాపాలను మాకు అమ్మేది లేదంటూ బైట్‌డ్యాన్స్‌ మాకు సమాచార మిచ్చింది’ అని మైక్రోసాఫ్ట్ ఆదివారం నాడు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

ప్రతిపాదిత డీల్‌ ప్రకారం టిక్‌టాక్‌ ప్రమోటర్‌ బైట్‌డ్యాన్స్‌కు ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ భాగస్వామిగా నిలవనుంది. తద్వారా యూఎస్‌ వినియోగదారుల డేటాను నిర్వహించనుంది. అంతేకాకుండా టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగంలో వాటాను కొనుగోలు చేయనుంది.

రిలయన్స్ చేతికి టిక్ టాక్ ? సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త, అధికారికంగా స్పందించేందుకు నిరాకరించిన రిలయన్స్ గ్రూపు

అయితే టిక్‌టాక్‌ వినియోగదారులకు సంబంధించి జాతీయ భద్రతను కాపాడుతూనే ప్రైవసీ, ఆన్‌లైన్‌ సెక్యూరిటీ తదితర అంశాలలో పటిష్ట చర్యలు తీసుకోగలమని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. దీంతో ఇప్పటికే తమ ప్రతిపాదనలపట్ల నమ్మకంగా ఉన్నట్లు తెలియజేసింది. అయితే ఈ విషయంపై టిక్‌టాక్ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. మరోవైపు.. ఒరాకిల్ సంస్థ కూడా ప్రస్తుతానికి మౌనాన్నే ఆశ్రయించింది. చైనీస్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగం కొనుగోలుకి యూఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలయితే మేలని ప్రెసిడెంట్ ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు.

చైనా, అమెరికా మధ్య నెలకొన్న రగడకు టిక్‌టాక్ కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. చైనా యాప్ టిక్‌టాక్ కారణంగా అమెరికా భద్రతకు ముప్పంటూ ట్రంప్ గతంలో పలు మార్లు హెచ్చరించారు. టిక్‌టాక్‌లో నమోదైన అమెరికా యూజర్ల సమాచారం ఆధారంగా దేశ పౌరులపై చైనా నిఘా పెడుతుందని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి దేశ భద్రతను ప్రమాదంలో పడేస్తుందని ట్రంప్ ఆరోపించారు.

ఈ క్రమంలోనే.. టిక్‌టాక్‌ను 90 రోజుల్లోగా అమెరికా సంస్థకు అమ్మకపోతే నిషేధం విధిస్తామంటూ ఇటీవల కార్యనిర్వహక ఉత్తర్వులను కూడా జారీ చేశారు. ఈ క్రమంలో మైక్రొసాఫ్ట్‌తో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ చర్చలు ప్రారంభించింది. మరో అమెరికా సంస్థ ఒరాకిల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అంతకుమునుపు.. టిక్‌టాక్ ట్రంప్ ఉత్తర్వులను అమెరికా కోర్టులో సవాలు చేసింది. అయితే..ట్రంప్ విధించిన డెడ్‌లైన్ సమీపిస్తున్న వేళ.. బైట్‌‌డ్యాన్స్ మా ఆఫర్‌ను తిరస్కరించిందంటూ మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అదే సమయంలో.. ఈ యాప్ ఒరాకిల్ పరం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.