Canada, July 24: కెనడా (Canada)లో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో ఓ భారతీయ విద్యార్థి మృతి చెందాడు. గుర్ విందర్ నాథ్ (24) (Gurvinder Nath ) అనే యువకుడు ఒంటారియా ప్రావిన్స్ (Ontario Province)లో పిజ్జా డెలివరీ బాయ్ (Pizza Delivery Boy) గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జులై 9వ తేదీన తెల్లవారుజామున 2:30గంటల సమయంలో మిస్సిసాగా (Mississauga) ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్ విందర్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడి వాహనాన్ని దొంగలించారు.
ఈ దాడిలో గుర్‌విందర్ తల, శరీర భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. ‘‘గుర్‌విందర్ మృతి ఎంతో బాధాకరం. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ సిద్ధార్థ్ నాథ్ ప్రకటించారు. గుర్‌విందర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు స్థానిక పోలీసు అధికారి ఫిల్ కింగ్ తెలిపారు. జులై 27న గుర్ విందర్ మృతదేహాన్ని భారత్ కు తరలించనున్నారు. మరోవైపు గుర్ విందర్ పై దాడిని ఖండిస్తూ.. అతడికి నివాళిగా సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసాగాలో క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు.ప్రస్తుతం చివరి సెమిస్టర్ పరీక్షల కోసం గుర్‌విందర్ కెనడాలో ఉన్నాడని, చదువు పూర్తి కాగానే సొంతగా పిజ్జా ఔట్‌లెట్ ఓపెన్ చేయాలని కలలు కన్నాడని, అంతలోనే ఇలా జరగడం ఎంతో బాధాకరమని అతడి స్నేహితులు తెలిపారు.