Taiwan, AUG 03: తైవాన్-చైనా (China- Taiwan) సంక్షోభం ముదురుతున్నట్లే కనిపిస్తోంది. తైవాన్ (Taiwan) గగనతలంలోకి బుధవారం సాయంత్రం చైనా 27 యుద్ధ విమానాల్ని (#27Chinese) పంపింది. అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ (Nancy Pelosi) తైవాన్ పర్యటన ముగించుకున్న కొద్దిగంటల్లోనే చైనా తన యుద్ధ విమానాల్ని పంపడం గమనార్హం. తమ వాయుసేనకు చెందిన గగన తలంలోకి (Air Defence Zone)చైనా యుద్ధ విమానాలు ప్రవేశించినట్లు తైవాన్ రక్షణశాఖ ప్రకటించింది. చైనాకు చెందిన ఆరు జె-11 ఫైటర్స్, ఐదు జె-16 మల్టీరోల్ ఫైటర్స్, పదహారు ఎస్‌యూ-30 ఫైటర్స్ తమ గగనతలంలోకి వచ్చినట్లు తైవాన్ తెలిపింది. చైనా కవ్వింపు చర్యలను ఎదుర్కొనేందుకు కూడా తైవాన్ సిద్ధమైంది. చైనా విమానాలు తమ గగనతలంలోకి రాగానే యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్‌ను తైవాన్ యాక్టివేట్ చేసింది. స్వతంత్ర్య రాజ్యంగా ఉన్న తైవాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తైవాన్ స్వయంప్రతిపత్తికి భంగం కలిగిస్తే ఊరుకోబోమని అమెరికా హెచ్చరిస్తోంది. ఈ విషయంలో తైవాన్‌కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది. తైవాన్‌కు మద్దతు తెలిపే ఉద్దేశంతోనే అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ బుధవారం తైవాన్‌లో పర్యటించారు. అయితే, నాన్సీ పర్యటనను చైనా ఖండించింది. ఆమె అక్కడ అడుగుపెట్టిన వెంటనే లైవ్ ఫైర్ మిలిటరీ డ్రిల్స్‌ను చైనా ప్రారంభించింది.
తైవాన్‌కు సమీపంలో భారీగా ఆయుధాలను మోహరించింది. ప్రస్తుతం తైవాన్-చైనా మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు తైవాన్‌పై చైనా దాడికి దిగితే వెంటనే అమెరికా కూడా స్పందించే అవకాశం ఉంది.