Almaty, December 27: కజకిస్థాన్ (Kazakhstan)లో శుక్రవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం (Plane Crash) సంభవించింది. అల్మటీ విమానాశ్రయం (Almatyy Airport) నుండి 100 మందితో బయలుదేరిన విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే నేలకూలింది. విమానంలో 95 మంది ప్రయాణికులు కాగా, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కనీసం 14 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. వారంతా మధ్య ఆసియా దేశాలకు చెందిన వారని విమాశ్రాయ అధికారులు తెలిపారు. కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసర సేవలను అందుబాటులోకి తెచ్చారు.
అల్మటీ నగరం నుంచి రాజధాని నూర్-సుల్తాన్ వైపు వెళ్తుంది. అయితే టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఆ విమానం ఎత్తును కోల్పోయి రెండు అంతస్థులు గల ఒక కాంక్రీట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిందని తెలిపారు.
అయితే విమానంలో లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ విమానం బెక్ ఎయిర్ (Bek Air) సంస్థకు చెందినది. ఈ సంస్థ ఇదే రకమైన 100 జెట్ విమానాలను నడుపుతుంది. ఇప్పటికే ఆ విమానాలపై దర్యాప్తు పెండింగ్ లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ రకమైన విమానాలన్నింటినీ నిలిపివేస్తున్నట్లు విమానయాన కమిటీ తెలిపింది.
"బాధ్యులు చట్టం ప్రకారం కఠినమైన శిక్షను అనుభవిస్తారు" అని కజఖ్ అధ్యక్షుడు కాస్సిమ్-జోమార్ట్ తోకాయేవ్ ట్వీట్ చేశారు, బాధితులకు మరియు వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.