వరుస భూకంపాలతో అఫ్ఘనిస్తాన్ వణుకుతోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక(1గం.30ని. సమయంలో) సంభవించిన భూకంపంలో.. వెయ్యి మందికి పైగా మరణించగా.. సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది సజీవ సమాధి (Afghanistan Earthquake Death) అయ్యారన్నది ఇంకా తేలాల్సి ఉంది.ఇదిలా ఉంటే .. గురువారం ఉదయం మళ్లీ అఫ్ఘనిస్థాన్‌లో భూకంపం (Afghanistan Earthquake) సంభించింది. భారత కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో.. ఫజ్యాబాద్‌కు 76 కిలోమీటర్ల దూరంలో.. 163 కిలోమీటర్ల లోతున భూకంపం సంభించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు అయ్యింది. ప్రకంపనలతో వణికిపోయిన ప్రజలు.. వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే నష్టం గురించి వివరాలు అందాల్సి ఉంది.
భూకంప నష్టం నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది. వర్షం కారణంగా శిథిలాల తొలగింపు కష్టతరంగా మారుతోంది. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయి. ఖోస్ట్ ప్రావిన్స్ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతింది.
ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, 920 మందికి పైగా మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు
అలాగే పాక్‌టికా ప్రావిన్స్‌లోని బర్‌మలా, జిరుక్, నాకా, గియాన్ జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లే దెబ్బతినగా.. గియాన్ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితి తరపున షెల్టర్, ఆహార సదుపాయాలు నిరాశ్రయులకు అందడం మొదలైంది. ఆప్ఘనిస్తాన్ ప్రజలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారిని ఆదుకునేందుకు కావాల్సిన సామాగ్రిని అందించేందుకు రెడీగా ఉందని తెలిపారు.
ఇక గురువారం ఉదయం నేపాల్‌లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1, 4.9 తీవ్రతతో మధ్య నేపాల్ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కస్కీ జిల్లాలో ప్రజలు భయంతో రాత్రిపూట బయటకు పరుగులు తీశారు.