Kabul, August 23: అఫ్ఘానిస్థాన్ వశం చేసుకున్న తాలిబన్లకు సామాన్యులు ఊహించని షాక్ ఇచ్చారు. తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్ఘానిస్థాన్‌లోని సామాన్యులు కూడా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.పంజ్‌షిర్ కేంద్రంగా ఉన్న నార్తన్ అలయన్స్ , అఫ్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్..ఇటీవలే తాలిబన్ల (Taliban) పాలన అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. వీరికి సాధారణ పౌరుల మద్దతు కూడా క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పంజ్‌షార్, కపిసా ప్రాంతంలో సామాన్యులకు..తాలిబన్లకు జరిగిన ఘర్షణల్లో (Reports Of Taliban Sending Troops) ఏకంగా 300 మంది తాలిబన్లు హతమైనట్టు సమాచారం. అఫ్ఘానిస్థాన్‌లో ఇప్పటికీ తాలిబన్ల ఆధీనంలోకి రాని ఒకే ఒక ప్రాంతం పంజ్‌షిర్ ఒకటే.
పంజ్‌షిర్ (Panjshir Valley) రాజధాని కాబూల్‌కు ఉత్తరాన సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. పంజ్‌షిర్ చుట్టూ కోట గోడల్లా ఉన్న హిందూకుష్ పర్వతాలు, అడవులు కారణంగా తాలిబన్లకు ఈ ప్రాంతాన్ని వశం చేసుకోవడం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. ఇక్కడి జనాభా దాదాపు లక్షన్నర..! వీరందరూ తిజక్ జాతికి చెందిన వారు. ఇక్కడి ప్రజలకు పోరాట పటిమ చాలా ఎక్కువని పరిశీలకులు అంటుంటారు. 1996లో తొలిసారిగా ఆఫ్ఘాన్‌ను ఆక్రమించిన తాలిబన్లు ..పంజ్‌షీర్‌ను మాత్రం తమ వశం చేసుకోలేకపోయారు.
1990ల్లో తాలిబన్లకు సింహస్వప్నంగా నిలిచిన వ్యక్తి అహ్మద్ షా మసూద్. తాలిబన్లపై తిరుగుబాటుకు అప్పట్లో ఆయనే నాయకత్వం వహించారు. అక్కడి భౌగోళిక లక్షణాల ఆసరగా.. గెర్రిల్లా యుద్ధం చేస్తూ అహ్మద్ షా మసూద్ తాలిబన్ల వణుకు పుట్టించారు. 2001లో తాలిబన్లు దొంగచాటుగా దెబ్బకొట్టడంతో ఆయన మరణించారు. ఇంటర్వ్యూ కోసం జర్నలిస్టుల రూపంలో వచ్చిన ముష్కరులు అహ్మద్‌పై అకస్మాత్తుగా దాడి చేసి హత్య చేశారు.
ప్రస్తుతం..పంజ్‌షిర్ వాసులు మరోసారి తాలిబన్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు తాలిబన్లకు సింహస్వప్నంగా నిలిచిన అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసూద్ (Ahmad Massoud) ప్రస్తుతం తాలిబన్ల వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారు. తమకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేస్తే తాలిబన్ల ఆటకట్టిస్తామని ఆయన ఇటీవలే శపథం చేశారు. ఇక అప్ఘాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సాలేహ్ కూడా తాలిబన్ల కథ ముగిస్తామని బహిరంగ ప్రకటన చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ తాలిబన్లు ఎదుర్కొనేందుకు పంజ్‌షిర్ వేదికగా వ్యూహాలు రచిస్తున్నారు.