Algeria, August 11: ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒకేసారి అటవీ ప్రాంతంలో అంటుకున్న దావానలం ఘోర విషాదాన్ని (Algeria Wildfires) నింపింది. ఏకంగా 42 మంది అగ్నికి ఆహుతైన ఘటన అక్కడ విషఆదం నింపింది. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 42 మంది మృతి (Algeria Wildfires Kill 42) చెందారు. వీరిలో 25 మంది సైనికులతో పాటు 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మరో 14 మంది సైనికులు గాయపడ్డారు.
అగ్నిమాపక సిబ్బంది, సైన్యం మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రాజధాని అల్జీర్స్‌కి తూర్పున ఉన్న కబీలీ ప్రాంతంలోని అటవీప్రాంతమైన కొండలపై మంటలు, భారీగా పొగలు అలుముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంటల నుంచి సుమారు వంద మందికి పైగా ప్రజలను సైనికులు రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు సైతం మృత్యువాత పడ్డారు.
ఈ ఘోరంపై ప్రెసిడెంట్ అబ్దేల్‌మాద్జిద్ తెబ్బౌన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. బాధిత బెజియా, టిజి ఓజౌ ప్రాంతాల్లో ప్రజలను రక్షించేందుకు బలగాలను అప్రమత్తం చేశామని ఆయన ట్వీట్ చేశారు. సైన్యాన్ని కూడా రంగంలోకి దించినట్టు వెల్లడించారు. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు పెద్ద ఎత్తున చెలరేగిన మంటలపై కుట్ర కోణాన్ని పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఒకేసారి మంటలంటుకోవడం వెనుక క్రిమినల్స్ హస్తం తప్పక ఉండి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.
అల్జీరియాలోని దాదాపు 17 రాష్ట్రాల్లో కార్చిచ్చు చెలరేగుతోంది. 100కు పైగా ప్రాంతాలను మంటలు అంటుకున్నాయి. అడవుల్లో పశువులు, పక్షులు మంటలకు ఆహుతైన దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. అనేక మంది ఇప్పటికే గ్రామాలను విడిచి వెళ్లిపోగా.. కొంత మంది మంటలు తమ ఇళ్లను తాకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే, కొంతమంది దుండగులు కావాలని నిప్పు పెట్టడం వల్లే ఈ మంటలు చెలరేగుతున్నాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కమెల్ బెల్డ్‌జౌద్ ఆరోపించారు. ప్రధాని సైతం ఈ తరహా అనుమానాలే వ్యక్తం చేశారు. మంటలు చెలరేగుతున్న తీరు చూస్తుంటే కచ్చితంగా కొంతమంది నేరస్థులే ఈ దుశ్యర్యకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోందన్నారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయానికి 30 ప్రదేశాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
Here's Firing Visuals
#Algeria : Defence ministry has just said that 18 members of military have died as result of fires raging through forests & hillsides of Kabylie #الجزائر pic.twitter.com/uPVZ6jGMUf
— sebastian usher (@sebusher) August 10, 2021
the fires in algeria are still strong; eleven dead were reported with over 80 wounded.. no help from the authorities was sent yet 💔#AlgeriaIsBurning pic.twitter.com/ki7mSRRD1s
— ♠️ (@cicegimeda) August 10, 2021
Fires everywhere #PrayForAlgeria #Algeria https://t.co/r7JMeB4GpF
— Jasmine 🌺 (@jasoSisin) August 10, 2021
గ్రీస్, టర్కీ, సైప్రస్, పశ్చిమ అమెరికా సహా ఇటీవలి భారీ మంటల బారిన పడిన దేశాల జాబితాలో అల్జీరియా చేరింది. దేశంలోని ఉత్తరాన ఉన్న 18 రాష్ట్రాల్లో 70కి పైగా ప్రదేశాల్లో మంటలు చెలరేగాయి, వీటిలో కబిలీలోని అత్యధిక జనాభా కలిగిన నగరాలు పది ఉన్నాయి. దావానలంలో వ్యాపించిన అగ్నికీలలకు కబైలీ ప్రాంతంలోని ఆలివ్ చెట్లు పూర్తిగా నాశనమైపోయాయి. మొత్తం కొండంతా మండుతున్న అగ్నిగోళంలా మారిపోయిందని, ఒక్కసారిగా ప్రపంచం అంతమైపోతుందా అన్నంత భయపడ్డామంటూ ఆందోళన వ్యక్తం చేశారని స్థానిక మీడియా నివేదించింది.
కాగా గత నెలలో అడవులకు నిప్పుపెట్టిన కేసుల్లో 30 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు, మరణ శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష విధించే బిల్లును జారీ చేశారు. జూలైలో, ఆరెస్ పర్వతాలలో 15 చదరపు కిలోమీటర్ల (ఆరు చదరపు మైళ్ళు) అడవి ధ్వంసానికి కారణమైన మానితులపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. 2020 లో, దాదాపు 440 చదరపు కిలోమీటర్లు (170 చదరపు మైళ్ళు) అడవి అగ్నిప్రమాదానికి గురైంది. అనేక మందిని అరెస్టు చేశారు.