Australia Bushfires: 100 కోట్లకు పైగా ప్రాణులు సజీవదహనం, నిరాశ్రయులైన వేలమంది, మనసులు కలిచివేస్తున్న ఆస్ట్రేలియాలో రగిలిన కార్చిచ్చు, ఈ లెక్కలో మరో 10 వేల ఒంటెలను అధికారికంగా చంపనున్న ప్రభుత్వం
Australia Bushfire Disaster | Photo: Twitter

New South Wales, January 9: నిన్నటి వరకూ ఎటుచూసిన పచ్చదనంతో, పక్షుల కిలకిల రాగాలతో, వన్యప్రాణుల పరుగులతో, స్వచ్ఛమైన గాలులతో ఒక అద్భుతంగా కనిపించిన అడవి నేడు ఎటూ చూసిన కాలిపోయిన చెట్లతో, నిర్మానుష్యమైన ఒక ఎడారి లాగా, ఎటు చూసిన మూగజీవాల కళేబరాలతో బూడిదను వెదజల్లుతూ ఉంది. అంతా మసి, బూడిద (Disaster)  తప్ప అక్కడ ఏం మిగల్లేదు.

ఆస్ట్రేలియా (Australia) లో వివిధ ప్రాంతాలలో చెలరేగిన కార్చిచ్చు (Bushfires) అంతకంతకూ విస్తరిస్తుందే తప్ప, ఎంతకీ తగ్గడం లేదు. చుట్టూ మంటలు వ్యాపించడంతో ఎటు వెళ్లాలో తెలియని మూగజీవాలు అందులో చిక్కుకొని సజీవంగా దహనం అవుతున్నాయి. ఇప్పటివరకూ 100 కోట్లకు పైగానే మూగజీవాలు (Animals) అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ఇక పక్షులు, సరిసృపాలు, ఇతర క్షీరదాలను అన్నింటిని కలుపితే వాటి సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనావేశారు. ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన జాతి జంతుజీవులు పూర్తిగా అంతరించిపోయి, కేవలం రికార్డుల్లో మాత్రమే ఇలా ఉండేవి అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ కార్చిచ్చు కారణంగా దాదాపు 25 మంది మనుషులు కూడా చనిపోయారు. వీరిలో కొందరు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. సుమారు 6.3 కోట్ల హెక్టార్లలో విస్తరించి ఉన్న అడవి బుగ్గిపాలు అయింది.

కార్చిచ్చు ప్రభావం ఎక్కువగా న్యూసౌత్ వేల్స్ ప్రాంతంలో తీవ్రంగా ఉంది. ఈ ఒక్కచోటే 5 మిలియన్ల హెక్టార్లలో అగ్నికీలలు విధ్వంసం సృష్టించాయి. 1300 పైగా ఇళ్లు మంటలకు ఆహుతయ్యాయి. వేలమంది నిరాశ్రయులయ్యారు. వారాల తరబడి ఇక్కడ కార్చిచ్చు విస్తరిస్తూ ఉండటంతో న్యూసౌత్ వేల్స్ లో అధికారులు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. గత నవంబర్ నుంచి ఈ కార్చిచ్చూ ప్రబలతూ ఉంది.

సౌత్ ఆస్ట్రేలియా, అడిలైడ్ ప్రాంతాల్లోనూ కార్చిచ్చు ప్రభావం కనిపిస్తుంది. సముద్రంలో అలలు నల్లగా, మసి బూడిదతో కూడా వస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా రాజధాని కాన్ బెర్రాలో కూడా గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది వారాల తరబడి నిరంతరం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

10 వేల ఒంటెలను చంపేయనున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం

 

ఆస్ట్రేలియాలో డిసెంబర్ నుంచి మార్చి వరకు వేసవి కొనసాగుతుంది. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుంది. దీనికి తోడు కార్చిచ్చు చెలరేగడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎంత కృషి చేస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. తీవ్రమైన వడగాలులు, వాతావరణంలో తేమ లేకపోవడం చేత ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు దావణంలా వ్యాపిస్తుంది. గంటకు 9.5 కిలోమీటర్లు కార్చిచ్చు విస్తరిస్తూపోతుంది. దీంతో వేడి మరింత పెరిగింది. ఎండలు, కార్చిచ్చుల కారణంగా ఆస్ట్రేలియా వాసులు అల్లాడిపోతున్నారు.

Australian Camels | File Photo

ఆస్ట్రేలియాలో తీవ్ర నీటి కొరత, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒంటెలు భారీగా నీటిని తీసుకొని వాటి శరీరంలోనే భద్రపరుచుకుంటాయి. ఈ క్రమంలో ఒంటెలు (Australian Camels) భారీగా నీటిని తాగేస్తున్నాయి. దీంతో 10 వేల ఒంటెలను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

ఒంటెలు కంచెలు దాటుకొని జనావాసాల్లోకి చొరబడి నీటిని తాగేస్తున్నాయని, ఏసీలు, కూలర్లు వేటిని వదలటం లేదు. దీనికి తోడు వాతావరణంలో వేడిని పెంచే మిథేన్ గ్యాస్ ను ఒంటెలు విడుదల చేస్తున్నాయి. 9 ఏళ్లలో వీటి సంఖ్య రెట్టింపు అవుతుంది. ఈ కారణాల చేత వీటిని సాయుధులైన నిపుణుల చేత 10 హెలికాప్టర్లలో బయలు దేరి చంపేయాలని నిర్ణయించారు. అయితే ఈ చర్య పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోట్ల జీవాలు చనిపోయాయి. అదనంగా వీటిని చంపడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నిస్తున్నారు.