బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 300 స్థానాలకు గాను ఇప్పటికే 200 చోట్ల నెగ్గి అధికార అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది.ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి పగ్గాలు చేపట్టనున్నారు. మొత్తంగా 5వ సారి అధికార పీఠం ఎక్కనున్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు విపక్షాలన్నీ బహిష్కరించిన ఈ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు.దాంతో కేవలం 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించారు. సాయంత్రం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు.సోమవారం ఉదయానికి పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.
బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. మొత్తం 300 నియోజకవర్గాలకు గాను 299 చోట్ల పోలింగ్ నిర్వహించారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు.షేక్ హసీనా గోపాల్‌గంజ్-3 స్థానం నుంచి వరుసగా 8వ సారి అత్యంత భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. ఆమె 249,965 ఓట్లు సాధించగా, సమీప ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్ సుప్రీం పార్టీ అభ్యర్థి నిజాముద్దీన్ లష్కర్‌కు 469 ఓట్లు మాత్రమే వచ్చాయి.