Dhaka, August 5: బంగ్లాదేశ్ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు.బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నిరసనకారులు హింసామార్గాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. దీనికి ముందు షేక్ హసీనాకు ఆర్మీ అల్టిమేటం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు పలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే రాజీనామా చేసి, సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సమాచారం. త్రిపుర రాజధాని అగర్తలకు హసీనా చేరుకున్నారని సమాచారం. అక్కడి నుంచి లండన్‌కు వెళ్లనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా, చెలరేగిన హింస నేపథ్యంలో తలదాచుకోవడానికి భారత్ బయలుదేరినట్లుగా వార్తలు
మేం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. నిరసనల వల్ల ఈ దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ హింసను ఆపాల్సిన సమయం ఇది. నా ప్రసంగం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. పరిస్థితుల్లో మార్పు వస్తే.. అత్యయిక స్థితి అవసరం ఉండదు’’ అని ఆర్మీ చీఫ్ టీవీ ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. అప్పుడే హసీనా రాజీనామా చేసిన విషయాన్ని వెల్లడించారు.హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది. బంగ్లాదేశ్ లో మరోసారి రక్తపాతం, ఏకంగా 32 మంది మృతి, ఇంటర్నెట్ సేవలు బంద్
బంగ్లాదేశ్ (Bangladesh) లో రాజకీయ సంక్షోభం (Political crisis) నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ (High alert) ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్‌ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
గత పదిహేనేళ్లుగా బంగ్లా ప్రధాని పదవిలో షేక్ హసీనా కొనసాగుతున్నారు. 1996 జూన్‌లో తొలిసారి ఆమె ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత 2009 నుంచి రాజీనామా దాకా ఆమె ప్రధానిగా కొనసాగారు. మొత్తంగా 20 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె.. సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన బంగ్లాదేశ్ నేతగానే కాకుండా ప్రపంచంలోనూ తొలి మహిళా నేతగా ఘనత సాధించారు.
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లకు సంబంధించి మొదలైన గొడవ తీవ్ర హింసకు దారి తీసింది. వందల మంది మరణానికి కారణమైంది. ఆందోళనకారులకు, భద్రతాబలగాలకు నడుమ జరిగిన హింసలో కేవలం ఆది, సోమవారాల్లోనే 90 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. సోమవారం బంగ్లా ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టారు. స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార అవామీలీగ్, దాని విద్యార్థి విభాగం ఛాత్ర లీగ్, జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీంతో వాటిని నిరోధించేందుకు పలుచోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి.
ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఫేస్‌బుక్, మెసెంజర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రాం సేవలనూ నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. ప్రజా భద్రతను పరిగణనలోకి తీసుకుని సోమవారం నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
మరోవైపు నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడే వారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని ప్రధాని హసీనా పేర్కొన్నారు. చర్చలకు ఆహ్వానిస్తూ శనివారం ఆమె ఇచ్చిన పిలుపును యాంటీ-డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూమెంట్ తిరస్కరించింది. ఇటీవల ఇదే అంశంపై చోటుచేసుకున్న ఘర్షణల్లో దాదాపు 200లకు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడ భారత పౌరులను భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. దేశంలో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులు తమతో సంప్రదిస్తూ ఉండాలని సిల్హట్‌లోని అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇందుకు సంబంధించి స్థానిక కార్యాలయ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.
ప్రస్తుత సమయంలో బంగ్లాదేశ్‌కు భారతీయులు ఎవరూ వెళ్లవద్దని తెలిపింది. అత్యవసర సాయం కోసం భారత హైకమిషన్ ఫోన్ నంబర్లను +8801958383679 +8801958383680 +8801937400591 విడుదల చేసింది. ఇక.. బంగ్లాదేశ్ విముక్తి యోధుల వారసులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ల నిర్ణయం ఇటీవల బంగ్లాలో చిచ్చు రేపడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు వాటిని 5 శాతానికి తగ్గించింది.