United Nations. (Photo Credits: Pixabay)

New Delhi, Sep 7: ఇండియా (India) పేరు మార్పు అంశం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి విదితమే. తాజాగా ఇండియా పేరు మార్పుపై ఐక్యరాజ్య సమితి (United Nations) స్పందించింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. పేర్ల మార్పుపై దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనలను స్వీకరించి పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. భారత్ నుండి అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది.

ఈ సందర్భంగా గతేడాది టర్కీ తన పేరును ‘తుర్కియే’గా మార్చుకున్న విషయాన్ని ఐరాస (UN) ఉదహరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి ఫర్హాన్‌ హక్‌ మాట్లాడుతూ.. తుర్కియే విషయంలో ఆ దేశ ప్రభుత్వం తమకు అందించిన అధికారిక అభ్యర్థనను స్వీకరించి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఏ దేశమైనా ఇలాంటి అభ్యర్థనలు పంపిస్తే వాటిని మేం పరిగణనలోకి తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

ఇండియా పేరును భారత్ వద్దనుకుంటే పాకిస్తాన్ ఆ పేరును పెట్టుకుంటుందట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్ ఇదిగో..

దేశంలో పేరు మార్పు అంశం రాజకీయదుమారానికి తెర తీసింది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ President of Bharat అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది.

కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతోంది. బీజేపీ ఆ విమర్శలకు కౌంటర్‌ ఇస్తోంది. అయితే.. విపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు భారత్‌ అనే పేరు మార్పుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ ఈ విషయంలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పేరు మార్పు విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలని మంత్రులను కోరారాయన.