చైనాలో కరోనా వైరస్ మరోసారి బుసలు కొడుతోంది. కొత్త కరోనా వేరియంట్(Covid Variant) విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెలలో తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలో ప్రస్తుతం వారానికి దాదాపు 65 మిలియన్ల మందికి కొత్తగా వైరస్ సోకే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వల్ల చైనాలో మళ్లీ కలకలం మొదలైంది. జీరో కోవిడ్ పాలసీ నుంచి ఇటీవల చైనా ఫ్రీ అయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల సరఫరాను పెంచేసింది.
ప్రఖ్యాత వైరాలజిస్ట్ జాంగ్ నాన్‌షాన్ ప్రకారం రెండు కొత్త వేరియంట్లు చైనాలో అలజడి సృష్టిస్తున్నట్లు ఇటీవల ద వాషింగ్టన్ పోస్టు ఓ కథనాన్ని రాసింది. అయితే ఆ వేరియంట్ల కోసం వ్యాక్సిన్లను రిలీజ్ చేసినట్లు కూడా ఆయన తెలిపారు. చైనాలోని మూడు కొత్త వేరియంట్లను(ఎక్స్‌బీబీ 1.9.1, ఎక్స్‌బీబీ 1.5, ఎక్స్‌బీబీ 1.16) అడ్డుకునే టీకాలకు ప్రాథమిక అనుమతి ఇచ్చామని ప్రముఖ చైనా అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ నాన్షాన్ సోమవారం తెలిపారు. మరికొన్ని రోజుల్లో కొత్త వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వనున్నట్లు జాంగ్ వెల్లడించారు. గ్వాంగ్జోలో జరిగిన బయోటెక్ కంపెనీల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మరో మూడు నాలుగు టీకాలకు కూడా త్వరలో అనుమతులు రానున్నట్టు వెల్లడించారు.గత ఏడాది శీతాకాలంలో చైనా జీరో కొవిడ్ పాలసీ పేరిట విధించిన కఠిన ఆంక్షలకు తెరదించింది. ఫలితంగా అప్పట్లో ఒక్కసారిగా జనాభాలో 85 శాతం మంది కరోనా కాటుకు గురయ్యారు.తాజాగా ప్రబలుతున్న వైరస్ వల్ల ప్రజలు ఎక్కువ స్థాయిలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో కూడా కొత్త వేరియంట్ల వల్ల ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. గత నెల రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు బీజింగ్‌లోని అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.