Beijing, Oct 26: చైనాలో మళ్లీ కరోనా విరుచుకుపడుతోంది, నగరాలకు నగరాలే లాక్‌డౌన్ (Lockdown in China) దిశగా వెళుతున్నాయి. కరోనా వ్యాప్తితో కఠిన లాక్‌డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఉత్తర చైనా ఇన్నర్ మంగోలియా అటానమస్ ప్రాంతంలో కరోనా కేసులు మళ్లీ పెరగడంతో అధికారులు లాక్‌డౌన్ (China Puts Lanzhou Under Lockdown) విధించారు. గత వారం రోజుల వ్యవధిలో ఈ 11 ప్రావిన్స్‌లలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.వీటిలో దాదాపు మూడోవంతు కేసులు ఈ ప్రాంతంలోని అలగ్జా లెఫ్ట్ బ్యానర్‌లోనే నమోదయ్యాయి. ఇక్కడ మొత్తం 1.8 లక్షల మంది నివసిస్తున్నారు.
తాజా కేసుల నేపథ్యంలో (Covid-19 Cases Rise) అప్రమత్తమైన అధికారులు ఎజిన్ బ్యానర్‌లోని 35,700 మంది ప్రజలను బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఆంక్షలే ఎరెన్‌హాట్‌లోనూ ఉన్నాయి. ఆదేశాలను ఉల్లంఘించి బయటకు వస్తే సివిల్, క్రిమినల్ కేసులు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఎజిన్ బ్యానర్ ఆరోగ్య కమిషనర్ సహా ఆరుగురిపై ప్రభుత్వం వేటేసింది. కాగా, దేశంలో 2 బిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు ఈ ఏడాది ఆగస్టులో చైనా ప్రభుత్వం ప్రకటించింది.
చైనాలో మరోసారి కోవిడ్-19 విజృంభణ, బీజింగ్‌లో పలు ప్రాంతాల్లో అలర్ట్, అప్రమత్తమైన అధికారయంత్రాంగం
ఇక చైనాలో మూడింట ఒక వంతు అంటే దాదాపు 11 ప్రావిన్స్‌లలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో చైనా సర్కారు కొవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలోని ప్రావిన్స్‌లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గాన్సు, ఇన్నర్ మంగోలియా, నింగ్ క్సియా, గుయిజౌ, బీజింగ్ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నది. దాంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలను అధికారులు మూసివేశారు. మరోవైపు దేశ రాజధాని బీజింగ్‌లో ఇప్పటివరకు 14 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోకి వచ్చే వారికి అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.