China Reports 1st Human Case Of H3N8 Bird Flu

చైనాను మరో వైరస్‌ కలవరపాటుకు గురిచేస్తోంది. ఏవియన్ ఫ్లూ H3N8(బర్డ్‌ ఫ్లూ) జాతికి సంబంధించిన మొట్టమొదటి మానవ కేసు చైనాలో వెలుగు చూసింది. కాగా, ఇది ప్రజలలో విస్తృతంగా వ్యాపించే ప్రమాదం తక్కువగా ఉందని ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. అ​యితే, సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న బాలుడు(4) కొద్దిరోజుల క్రితం జ్వరం, ఇతర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బాలుడికి పరీక్షలు చేయగా అతడికి ఈ వ్యాధి సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్(NHC) స్పష్టం చేసింది.

బాధితుని ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులు ఉన్నాయని.. వాటివల్లే H3N8 వేరియంట్‌ అతనికి సోకిందని చెప్పారు. అయితే, బాధితునితో ఉన్నవారికి ఆ వైరస్‌ సోకలేదని స్పష్టం చేశారు. దీంతో, చనిపోయిన లేదా జబ్బుపడిన పక్షులకు దూరంగా ఉండాలని.. జ్వరం లేదా శ్వాసకోశ లక్షణాలకు సంబంధిన వ్యాధితో ఎవరైనా బాధపడుతుంటే తక్షణమే చికిత్స పొందాలని ప్రజలను చైనా ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

చైనాలో ఘోరంగా మారిన కరోనా పరిస్థితులు, తాజాగా షాంఘైలో ముగ్గురు మృతి, లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన 40 కోట్ల మంది ప్రజలు

కాగా మొదటిసారిగా 2002లో H3N8 వైరస్‌ ఉత్తర అమెరికా వాటర్‌ఫౌల్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఈ వైరస్‌ కేవలం గుర్రాలు, కుక్కలు, సీల్స్‌కు మాత్రమే సోకుతుందని వైద్యశాఖకు చెందిన అధికారులు తెలిపారు. కానీ, తాజాగా మనుషులకు కూడా ఈ వైరస్‌ సోకడంతో ఆందోళన నెలకొంది.