Washington, June 13: చైనాలో మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అక్కడ గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లను (New Coronaviruses in Bats) గుర్తించినట్లు చైనా పరిశోధకులు (Chinese Researchers) ప్రకటించారు.రినోలోఫెస్ పుసిల్లుస్ అనే వైరస్ వీటిలో ఒకటని, ఇది ప్రస్తుత కోవిడ్-19 వైరస్‌కు జన్యుపరంగా దగ్గరగా ఉన్నవాటిలో రెండోదని తెలిపారు. షాండోంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను ‘సెల్’ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధనలు కేవలం చైనాలోని ఓ చిన్న ప్రావిన్స్ అయిన యునాన్‌కు సంబంధించినవే.
ఆ చిన్న ప్రాంతంలోనే అలా ఉంటే మిగతా పెద్ద ప్రాంతాల్లోని గబ్బిలాల్లో ఏ స్థాయిలో ఈ కొత్త కొత్త కరోనా వైరస్‌లు ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ గబ్బిలాలు మనుషులతోపాటు పందులు, ఎలుకలు, పశువులు, పిల్లులు, కుక్కలు, కోళ్లకు కూడా వ్యాపింపజేసే ప్రమాదం ఉంటుందని చైనా పరిశోధకులు అంటున్నారు. యునన్‌లోని ఉష్ణ మండల ఉద్యానవనాలు (ట్రాపికల్ బొటానికల్ గార్డెన్), దాని పరిసరాల్లోని అడవుల్లో నివసించే గబ్బిలాల నుంచి నమూనాలను పరిశోధకులు సేకరించారు. గబ్బిలాల రెట్టల నమూనాలు 283, నోటి నమూనాలు 109, మూత్ర నమూనాలు 19 సేకరించి, అధ్యయనం నిర్వహించారు. 2019 మే నుంచి 2020 నవంబరు మధ్య కాలంలో వీటిని సేకరించారు.
2019 చివర్లో SARS-CoV-2 అనే ఓ కొత్త కరోనా వైరస్‌ను కనుగొన్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్‌లో కనిపించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజా పరిశోధనలో భాగంగా పరిశోధకులు గబ్బిలాలకు చెందిన 283 మలం నమూనాలు, 109 నోటి స్వాబ్‌లు, 19 మూత్ర నమూనాల ఫలితాలను సెల్ అనే జర్నల్‌లో ప్రచురించారు. షాడాంగ్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు ఫలితాల గురించి చెబుతూ.. వివిధ గబ్బిలాల జాతుల నుంచి మొత్తం 24 కొత్త కరోనా వైరస్ జీనోమ్‌లను గుర్తించినట్లు చెప్పారు.
ఇందులోని ఒకటి మాత్రం ప్రస్తుత కరోనా వైరస్‌కు చాలా దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. స్పైక్ ప్రొటీన్‌లో చిన్న మార్పులు తప్ప.. మిగతాదంతా ఇప్పుడు SARS-CoV-2లాగే ఉన్నదని ఆ పరిశోధకులు చెప్పారు. థాయ్‌లాండ్‌లోనూ గతేడాది జూన్‌లో గబ్బిలాల్లో ఇలాంటి వైరస్‌ను గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గబ్బిలాల్లో కరోనాలాంటి వైరస్‌లు భారీగా సర్క్యులేట్ అవుతున్నట్లు వాళ్లు చెప్పారు.