Beijing, Sep 14: విశ్వమానవాళిని ముప్పతిప్పలు పెడుతున్న కరోనావైరస్ (Coroanvirus) పుట్టుకపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అది చైనా నుంచే ఉద్భవించిందని వాదనలు వినిపిస్తూ ఉన్నా వాటిని చైనా కొట్టి పారేస్తూ వస్తోంది. అయితే దీనిపై తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఈ కరోనా వైరస్ మహమ్మారి చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వుహాన్ ల్యాబ్‌లో (COVID-19 was made in Wuhan lab) తయారైందని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డా. లి మెంగ్ యాన్ (Chinese virologist Dr Li-Meng Yan) ఆరోపించారు. తన వాదనలను బలపర్చేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
చైనీస్ ప్రత్యేక పరిపాలనా ప్రాంతం హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరైన లీ మెంగ్ కరోనా వైరస్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమని మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆమె అన్నారు. పలు భద్రతా కారణాల దృష్టా‍్య ఆమె హాంకాంగ్‌నుంచి అమెరికాకు తరలివచ్చేశారు. సెప్టెంబర్ 11న ఓ షోలో ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌పై చేసిన పరిశోధనలు.. తాను ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆమె పంచుకుంది.
ఆ సమావేశంలో లీ మాట్లాడుతూ.. ‘‘నేను కరోనా వైరస్‌పై రెండు పరిశోధనలను చేశాను. దాని ఫలితాలను మా ఉన్నతాధికారితో పంచుకున్నాను. డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలు ఉన్న ఆయన చైనా గవర్నమెంట్ తరపున, డబ్ల్యూహెచ్‌ఓ తరపున ప్రజలకు మంచి జరిగేలా చేస్తారని అనుకున్నాను. కానీ, నన్ను నిశ్శబ్ధంగా ఉండమని, లేకపోతే ఎవ్వరికీ కనిపించకుండా పోతావని అన్నారు. కానీ, దీని గురించి బయటకు చెప్పకుండా ఉండలేకపోయాను.
ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేననిపించింది. అందుకే జనవరి 17న అమెరికాలోని ప్రముఖ చైనీస్ యూట్యూబ్ ఛానల్‌ను సంప్రదించాను. మొదటిసారి కోవిడ్ సంగతులను వారితో పంచుకున్నాన’’ని తెలిపింది. ఇప్పటికే పలువురు పరిశోధకులు చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకు వచ్చిందని తెలిపిన సంగతి విదితమే..