Coronavirus Outbreak: కరోనావైరస్‌పై కొత్త ట్విస్టు, ఈ వైరస్ గాలి ద్వారా సోకుతుందని నిర్ధారించిన సైంటిస్టులు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాసిన 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు
Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Geneva, July 7: కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపిస్తుందనే (Coronavirus Outbrea) వాదనలు వైరస్ పుట్టినప్పటి నుండి వస్తూనే ఉన్నాయి. అయితే అలాంటిదేమీ లేదంటూ డబ్ల్యూహెచ్‌వో (WHO) ఆ వార్తలను కొట్టిపారేస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు కరోనా వైరస్‌ గాలి ద్వారా (Coronavirus can be transmitted through air) ఇతరులకు సోకుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఒక లేఖ రాశారు. చైనాలో మళ్లీ కొత్తగా బుబోనిక్‌ ప్లేగు, ఈ వైరస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మంగోలియాపై అప్పుడే పంజా విసురుతున్న బుబోనిక్‌ ప్లేగు వైరస్

దగ్గు, తుమ్ముల నుంచి వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా కరోనా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటివరకూ చెబుతూండగా.. గాలి ద్వారా (airborne) సోకుతుందని, అతి సూక్ష్మ స్థాయి కణాలూ వైరస్‌ను (Covid-19 coronavirus) మోసుకెళ్లగలవని శాస్త్రవేత్తలు ప్రకటించారు.ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు (డబ్ల్యూహెచ్‌వో) లేఖ రాశారు.

అంతేకాకుండా.. వైరస్‌ వ్యాప్తికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే సవరించాలంటూ డబ్ల్యూహెచ్‌వోకు సూచించినట్టు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ శాస్త్రవేత్తలు వచ్చేవారం ఓ జర్నల్‌లో తమ లేఖతోపాటు ఆధారాలను ప్రచురించాలని భావిస్తున్నారు. గాలిలో సూక్ష్మ పరిమాణంలో ఉండే ధూళి కణాల ద్వారా వైరస్‌ వ్యాపిస్తున్నదని వీరు వాదిస్తున్నారు. రోగి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్‌ బయటికి వచ్చి.. గాలిలోని సూక్ష్మ కణాలపైకి (Airborne Transmission) చేరుతున్నదని చెప్పారు. తుంపర్లపై కరోనా వైరస్‌ గాలిలో 2-8 నిమిషాలపాటు జీవించే ఉంటుంది. ఒక వేళ ఆలోగా ఏదైనా ఉపరితలంపైకి చేరితే వాటి ఆయుష్షు మరింత పెరుగుతుంది.

ఈ కణాలు ఒక గది వంటి నిర్దేశిత ప్రాంతంలో తిరుగుతూ వైరస్‌ను వ్యాపింపజేస్తున్నాయన్నారు. అయితే ఈ అంశంపై డబ్ల్యూహెచ్‌వో ఇంతవరకూ స్పందించలేదు. గతంలోనూ ఇలాంటి ప్రతిపాదనలే రాగా.. డబ్ల్యూహెచ్‌వో కొట్టిపారేసింది. తుంపర్ల ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేస్తున్నది. ఐదు మైక్రాన్ల పరిమాణం ఉండే తుంపర్ల ద్వారా మాత్రమే గాలిలో కరోనా వైరస్‌ ప్రయాణిస్తుందని తెలిపింది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం వాదన నిజమైతే.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. గాలిని సైతం శుద్ధి చేసి వాడుకునే పరిస్థితులు తలెత్తవచ్చు.

గత నెల 29న మాత్రం వైద్య ప్రక్రియల సమయంలో వెలువడే ఐదు మైక్రాన్ల కంటే తక్కువ సైజున్న తుంపర్ల ద్వారా వైరస్‌ సోకే అవకాశమున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ భవనాల లోపల కూడా, జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ద్వారా సోకుతుందన్న సమాచారానికి ప్రాధాన్యమేర్పడింది. భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ ఇళ్లలో, ఇతర ప్రాంతాల్లో మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.

ఆరోగ్య కార్యకర్తలకు సాధారణ మాస్కుల స్థానంలో అతిసూక్ష్మమైన కణాలను అడ్డుకోగల ఎన్‌95 మాస్కులు ఇవ్వాల్సి వస్తుందని తెలిపింది. పాఠశాలలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో వెంటిలేషన్‌ వ్యవస్థలను సరిచేసుకోవాల్సి ఉంటుందని, అతినీలలోహిత కిరణాల సాయంతో భవనాల్లోపల శుద్ధి చేసుకోవడం మేలని డాక్టర్‌ బెనెడెట్టా అలెగ్రాంజీ తెలిపారు.