
Amaravati, Oct 26: సిత్రాంగ్ తుఫాను ధాటికి బంగ్లాదేశ్ అతలాకుతలమయింది.భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల వరదలు సంభవించి 35 మంది ప్రాణాలు ( kills people in Bangladesh) కోల్పోయారు. దాదాపు 20 వేల మంది నీటిలో చిక్కుకున్నారు.ఈ తుపాను (Cyclone Sitrang) బెంగాల్ తీరం సమీపంలో బంగ్లాదేశ్‌లోని బైరిసాల్ వద్ద తీరందాటింది. దీనిప్రభావంతో దేశంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది.
సుమారు 10 వేల ఇండ్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెల్లడించారు.దాదాపు 20 వేల మంది నీటిలో చిక్కుకున్నారు.సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో విద్యుత్ సరఫారాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 80 లక్షల మంది అంధకారంలోనే ఉండిపోయారు. ఎక్కడికక్కడ చెట్లు, స్తంభాలు నేలకొరిగాయని, బుధవారం వరకు విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారులు తెలిపారు.
తుఫాను ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోవండంతో 15 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 8 మిలియన్ల మంది ప్రజలు చీకట్లలోనే మగ్గుతున్నారని, 15 ఎకరాల్లో పంట నాశనమయిందని ప్రభుత్వం వెల్లడించింది. వేల సంఖ్యలో ఫిషింగ్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని తెలిపింది. విమాన రాకపోకలు నిలిచిపోయాయని, వరదల వల్ల రోడ్లు తెగిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయిందని పేర్కొన్నది.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని 2.19 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 6925 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపింది. దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేశామని వెల్లడించింది. కాగా, తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే తుఫాను అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
మంగళవారం సాయంత్రం నాటికి తుఫాను తీవ్రత తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. వరదల సమయంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. తుఫాన్ కారణంగా సోమవరం తాత్కాలికంగా నిలిపివేసిన విమాన సర్వీసులను 21 గంటల తర్వాత మంగళవారం నుంచి పునరుద్ధరించినట్లు వెల్లడించారు.
డెల్టా ప్రాంతమైన బంగ్లాదేశ్‌లో తరచూ తుఫాన్‌లు, వరదలు సంభవించి 1.6 కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. అయితే వాతావరణ మార్పుల కారణంగానే గతంతో పోల్చితే అత్యంత ప్రమాదకర విపత్తులు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.కాక్స్ బజార్‌లోని షెల్టర్లలో 10 లక్షల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నారని పేర్కొన్న అధికారులు, వారికి అత్యవసరాలైన ఆహారం, మందులు, నీళ్లు, టార్పాలిన్లు అందిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
ఇక సిత్రంగ్ తుపాను (Cyclone Sitrang) బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడిందన్న వార్త మరువక ముందే.. బంగాళాఖాతంలో (Bay of Bengal) మరో అల్పపీడనం ఏర్పడనుంది. సిత్రంగ్ తుపాను ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో (Low pressure area) ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడనుందని, దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నెలాఖరులో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అటు, ఏపీలోని పలు ప్రాంతాల్లో చలి వాతావరణం నెలకొంది. లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి.