IAF Rafale jets in Indian Ocean Region. (Photo Credit: Twitter/Indian Air Force)

New Delhi, July 13: రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌తో పలు ఒప్పందాలు కుదర్చుకోనున్నారు. ఇందులో భాగంగా కొత్త‌గా 26 రఫేల్ యుద్ధ విమానాల‌(Rafale Fighter Jets)ను కొనుగోలు చేసేందుకు ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తి ఇచ్చింది. కొనుగోలు ప్ర‌తిపాద‌న‌కు ర‌క్ష‌ణ‌శాఖ ఓకే చెప్పింది. 26 ర‌ఫేల్ విమానాల‌తో పాటు మూడు స్కార్పీన్ క్లాస్ జ‌లాంత‌ర్గామిల కొనుగోలుకు కూడా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.

దీంతో ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంటే 22 సింగిల్‌ సీటర్‌ రఫేల్‌ మెరైన్‌ విమానాలు, నాలుగు రెండు సీట్ల శిక్షణ విమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయి. వీటి కొనుగోలుకు సుమారు రూ.90వేల కోట్ల అవుతున్నట్లు అంచనా వేస్తున్నప్పటికీ.. ఒప్పందం పూర్తైన తర్వాతే కచ్చితమైన విలువ తెలియనుంది.

మోదీ ఫ్లైట్ మెట్లు దిగుతున్న వీడియో ఇదిగో, బాస్టిల్ డే పరేడ్‌ కోసం పారిస్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని

కాగా డిఫెన్స్ అక్విజిష‌న్ కౌన్సిల్ ఆ కొనుగోలుకు క్లియ‌రెన్స్ ఇచ్చింది. డీఏసీ మీటింగ్‌కు ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ హాజ‌ర‌య్యారు. త్రివిధ ద‌ళాధిప‌తి జ‌న‌ర‌ల్ అనిల్ చౌహాన్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన చీఫ్‌లు కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. అయితే ఫ్రాన్స్‌ ప‌ర్య‌టన‌ స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ దీనిపై ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

వీటితోపాటు ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్‌ కంపెనీ.. భారత్‌కు చెందిన ఒక సంస్థతో కలిసి సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను అభివృద్ధి చేసే అంశంపైనా ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా ఒప్పందం పూర్తయితే 22 సింగిల్‌ సీటర్‌ రఫేల్‌-ఎం జెట్‌లు, నాలుగు శిక్షణ విమానాలు భారత నౌకాదళానికి అందనున్నాయి. వీటిని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై మోహరిస్తారు. వాయుసేన కోసం భారత్‌ ఇప్పటికే 36 రఫేల్‌ జెట్‌లను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేయగా.. ఆ దేశ సహకారంతో భారత్‌లో ఇప్పటికే ఆరు స్కార్పీన్‌ జలాంతర్గాములను నిర్మించారు.

భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో యుద్ధ విమానాలు, జ‌లాంత‌ర్గాములు కావాల‌ని ఇటీవ‌ల నేవీ డిమాండ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్య‌, విక్రాంత్ .. మిగ్‌29 విమానాల‌ను ఆప‌రేట్ చేస్తున్నాయి. ముంబైలోని మ‌జగాన్ డాక్‌యార్డులో స్కార్పీన్ స‌బ్‌మెరైన్ల‌ను నిర్మించ‌నున్నారు.