Washington, January 16: సమస్యల పరిష్కారానికి యూఎస్ఎ- చైనా (USA - China) కలిసి ముందడుగు వేశాయి. దాదాపు రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన ఘర్షణలను తగ్గించుకునే దిశగా ఇరు దేశాలు ఒక పాక్షికమైన ఒప్పందాన్ని (Trade Deal) కుదుర్చుకున్నాయి. అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరియు చైనా ఉప ప్రధాని లియు హి ( Liu He) ఆ ఒప్పంద పత్రం మీద సంతకాలు చేశారు. రెండు ఆర్థిక దిగ్గజాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని ముగించడానికి అమెరికా- చైనా దేశాలు 'ఫేజ్ వన్' వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయని అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ నివేదించింది.
చైనా వైస్ ప్రీమియర్ లియు యూఎస్- చైనా వర్తక సర్దుబాట్లు, ఇతర వాణిజ్య పరమైన చర్చలు జరిపే డెలిగేట్స్ బృందానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనే యూఎస్ తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించారు.
ఈ ఒప్పందం సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ "ఈరోజు, మేము చైనాతో మునుపెన్నడూ లేనివిధంగా ఒక కీలక అడుగు వేస్తున్నాము", ఇది ఇరుదేశాల మధ్య వాణిజ్యపరమైన వ్యవహారాలకు సంబంధించి పరస్పర అవగాహననను నిర్ధారిస్తుంది, గతంలో దొర్లిన తప్పులను ఇరువురం కలిసి సరిదిద్దుకుంటున్నాము" అని పేర్కొన్నారు. త్వరలో తాను కూడా చైనాలో పర్యటిస్తానని ట్రంప్ తెలిపారు.
ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి చైనాకు వ్యవసాయ, పారిశ్రామిక ఎగుమతులు పెరగనున్నాయి. అయితే ఈ ఫస్ట్ ఫేజ్ ఒప్పందంలో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న సుంకాల (ఎక్సైజ్ టాక్స్) విషయంలో ఎలాంటి మార్పులు జరగకపోవడం గమనార్హం. ఈ అంశాన్ని 'రెండో ఫేజ్' ఒప్పందంలో పరిశీలించనున్నట్లు ట్రంప్ తెలిపారు.
యూఎస్- చైనా తాజా ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.
2018లో 25 బిలియన్ డాలర్ల విలువ ఉండే చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను అమెరికా భారీగా పెంచడంతో చైనా సుమారు 200 బిలియన్ డాలర్ల టాక్స్ కట్టాల్సి వచ్చింది. అప్పట్నించి ఇరు దేశాలు ఒకరి దిగుమతులపై ఒకరు పోటీగా టాక్స్ లు వేసుకోవడంతో వాణిజ్యయుద్ధం మొదలైంది.