New Delhi, May 8: కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను వణికిస్తోంది.. భారత్‌లో నెలకొన్న కరోనా సంక్షోభంపై (Coronavirus Crisis) యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) (European Investment Bank) అధ్యక్షుడు వెర్నర్ హోయెర్ స్పందించారు. ఈయూ బ్యాంక్ సొంత నిధుల నుండి 2,50,000 యూరోలు (రూ.2.22 కోట్లు) భారతదేశానికి అత్యవసర విరాళంగా ప్రకటించారు. భారత్‌లో సహాయ కార్యక్రమాల కోసం యునిసెఫ్ లక్సెంబర్గ్, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్, మాల్టెసర్ ఇంటర్నేషనల్‌కు ఈ నిధులు అందజేస్తామని వెల్లడించారు.
ఇక గ్లోబల్ అలయెన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (Gavi) ఇండియాకు పూర్తి సబ్సిడీపై 19 కోట్ల నుంచి 25 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు, 3 కోట్ల డాలర్ల (సుమారు రూ.220 కోట్లు) నిధులు ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నిధులను సాంకేతిక సాయం, కోల్డ్‌చెయిన్ పరికరాలు సమకూర్చుకోవడానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై కొవాక్స్ బోర్డు గత డిసెంబర్‌లోనే నిర్ణయం తీసుకున్నట్లు Gavi అధికార ప్రతినిధి చెప్పారు.
ఈ Gavi తక్కువ, మధ్యస్థాయి ఆదాయ దేశాలకు వ్యాక్సిన్లు అందించే బాధ్యత తీసుకుంది. ప్రస్తుతం ఇండియా ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల్లో పూర్తి మద్దతుగా ఉంటామని Gavi అధికార ప్రతినిధి హామీ ఇచ్చారు. అడ్వాన్స్ మార్కెట్ కమిట్‌మెంట్ (ఏఎంసీ)లో అందుబాటులో ఉన్న మొత్తం డోసులలో 20 శాతం ఇండియాకు ఇవ్వాలని కొవాక్స్ బోర్డు గత డిసెంబర్‌లోనే నిర్ణయించినట్లు చెప్పారు.
ఇవి సుమారు 19 కోట్ల నుంచి 25 కోట్ల వరకూ ఉంటాయని, వ్యాక్సిన్ ధరలు, అందుబాటులో ఉన్న నిధులను బట్టి పూర్తి సబ్సిడీపై వీటిని ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే సమయంలో అందుబాటులో ఉన్న మొత్తం నిధుల్లో 20 శాతం కూడా ఇండియాకు దక్కనున్నాయి. వ్యాక్సిన్ల తయారీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇండియాలో సంక్షోభం తమ వ్యాక్సిన్ల పంపిణీ ప్రభావం చూపినట్లు Gavi తెలిపింది.
దీంతో పాటు ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ ఏజెన్సీలు 10,000 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 10 మిలియన్ల మాస్కులను భారతదేశానికి పంపింది. ఐక్యరాజ్య సమితి బృందాలు జాతీయ, స్థానిక స్థాయిలో అధికారులతో సహకరిస్తున్నాయని యూఎన్ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ దుజారిక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి బృందం వెంటిలేటర్లతోపాటు ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటును కూడా కొనుగోలు చేసింది. అలాగే, యురోసెఫ్ కరోనా వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పరికరాలను కూడా అందిస్తున్నది.
మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి వేలాది మంది ప్రజారోగ్య నిపుణులను యూఎన్ నియమించింది. 1,75,000 టీకాల కేంద్రాలను పర్యవేక్షించడానికి యునిసెఫ్, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం సహాయం చేస్తున్నాయి. భారతదేశంలో కరోనా వైరస్ ప్రమాదకరమైన పరిస్థితిని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిటా ఫోర్ ముందే హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా తొమ్మిదిన్నర మిలియన్లకు పైగా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేయడంలో విమానాశ్రయాలు ప్రత్యేక పాత్ర పోషించాయని భారత ఎయిర్‌పోర్ట్ అథారిటీ (ఏఏఐ) పేర్కొన్నది.
టీకా సరుకులను వృధా చేయకుండా ఉండటానికి కలిసి పనిచేయడం, కోల్డ్ చైన్‌ను నిర్వహించడానికి వీలైనంత తక్కువ సమయంలో వాటిని రాష్ట్ర ఆరోగ్య శాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపింది. విమానం ల్యాండ్ అయిన మూడు నుంచి 20 నిమిషాల్లోనే వ్యాక్సిన్ల ను సంబంధిత విభాగాలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఏఏఐ పేర్కొన్నది.