London, December 13: ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రాణాలు కూడా తీసేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం (First Death Due to Omicron COVID-19 ) నమోదైంది. యూకేలో ఓ వ్యక్తి ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్టు నిర్ధారించారు.
దీనిపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (PM Boris Johnson) అధికారిక ప్రకటన చేశారు. పశ్చిమ లండన్‌లోని పడింగ్టన్ సమీపంలో ఓ వ్యాక్సినేషన్ క్లినిక్‌ను సందర్శించిన బోరిస్ జాన్సన్.. ఒమిక్రాన్‌వల్ల ఆస్పత్రుల పాలవుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. తాజాగా ఈ వేరియంట్ (COVID-19 Variant) బారినపడి ఒక వ్యక్తి మరణించడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.
కొత్త వేరియంట్ కారణంగా ఆసుపత్రిపాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఒమిక్రాన్ ను కట్టడి చేసేందుకు ప్రజలు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవడమొక్కటే అత్యుత్తమ మార్గం అని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. అటు, బ్రిటన్ ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ స్పందిస్తూ, ఒమిక్రాన్ పాజిటివ్ గా వచ్చిన వారు 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఈ ఒమిక్రాన్ వేరియంట్ మధ్యరకం వెర్షన్ అని నేను భావిస్తున్నా. ఈ వేరియంట్ మరింత విస్తరించకుండా అదుపు చేయాల్సిన అవసరం ఉన్నది. జనాల్లో ఇది ఎంత వేగంగా విస్తరిస్తున్నదో గుర్తించాల్సిన అసవరం ఉన్నది. అదేవిధంగా ఈ వేరియంట్ కట్టడికి అందరికీ బూస్టర్ డోస్‌లు అందించడమే ఉత్తమం అనేది నా అభిప్రాయం’ అని బోరిస్ జాన్సన్ చెప్పారు.