Dhaka, Mar 27: స్వాతంత్ర్యం సిద్ధించి 50 వసంతాలు అయిన సందర్భంగా బంగ్లాదేశ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక అతిథిగా వెళ్లిన సంగతి విదితమే. ఆయన రెండు రోజలు పాటు బంగ్లా పర్యటనలో ఉన్నారు. నిన్న నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో కలిసి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్‌లో నిరసన సెగ (violent protesters) తగిలింది. నరేంద్ర మోదీ పర్యటనకు నిరసనగా కొందరు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు దాడి చేయడంతో (Chittagong Police Fire) నలుగురు మృతిచెందారు.
బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నగరంలో నిరసనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ బుల్లెట్లు వినియోగించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. ఇక నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢాకాలో పర్యటించగా అక్కడ కూడా కొందరు నిరసన చేపట్టడం గమనార్హం. ఓ మతానికి చెందిన వారు ఈ ఆందోళనలు చేపట్టారు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు. ఈక్రమంలో తాను మొట్టమొదటిసారి పోరాటం చేసింది బంగ్లాదేశం కోసమేనని.. అది కూడా టీనేజ్‌లో ఉన్నప్పుడు అని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. నా ప్రయాణం ప్రారంభమయ్యిందే బంగ్లాదేశ్ స్వాతంత్రం (Bangladesh Independence Day 2021 Celebrations) కోసం. నా మిత్రులతో కలిసి నేను 20 ఏళ్ల వయసులో భారత్‌లో సత్యాగ్రహ దీక్ష చేశా. ఆ పోరాటం సందర్భంగా నేను జైలుకు కూడా వెళ్లా’ అని మోదీ తన రాజకీయ జీవిత అరంగేట్రాన్ని గుర్తుచేసుకున్నారు.
గొప్ప దేశం ఆవిర్భవించడానికి ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు మరువలేనివని మోదీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సైనికుల గొప్పదనం.. మమకారం సరిహద్దులో ఉండే భారతీయులు ఎప్పుడు మరువలేరని తెలిపారు. ‘ఇవి నా జీవితంలో మరచిపోలేని రోజులని, ఇంతటి గొప్ప కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని నరేంద్ర మోదీ చెప్పారు.
బంగ్లా జాతిపిత ముజిబుర్ రెహమాన్‌కు నివాళిగా ‘ముజీబ్ జాకెట్’ను మోదీ ధరించారు. ఆరు గుండీలతో, కింది భాగంలో రెండు జేబులతో, కోటు పైభాగంలో ఎడమవైపున మరో జేబుతో ఉండే ఖాదీ జాకెట్ ఇది. ముజిబుర్ రెహమాన్ జీవించి ఉన్నప్పుడు ఆయన ధరించిన జాకెట్లు ‘ముజీబ్ జాకెట్లు’గా పాపులర్ అయ్యాయి. మోదీ పర్యటన సందర్భంగా ‘ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ ఆఫ్ ఇండియన్ హైకమిషన్’.. 100 ముజీబ్ జాకెట్లు ఆర్డర్ చేసింది. వాటిలో ఒకదాన్నే మోదీ ధరించారు.
భారత ప్రభుత్వం 2020 సంవత్సరానికిగాను గాంధీ శాంతి బహుమతిని.. బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్‌కు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ బహుమతిని ప్రధాని మోదీ.. ముజిబుర్ రహమాన్ కుమార్తెలైన షేక్ హసీనా (బంగ్లాదేశ్ ప్రధాని), షేక్ రెహనాలకు ఇచ్చారు. బంగబంధు మానవహక్కుల చాంపియన్ అని.. ఆయన భారతీయులకు కూడా హీరోయేనని కొనియాడారు. ఆయనకు గాంధీ శాంతి బహుమతి ఇవ్వడం భారత్‌కు గౌరవమన్నారు.
బంగ్లాదేశ్ జాతిపిత, బంగబంధు షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌కు ఇవాళ ప్రధాని మోదీ నివాళి అర్పించారు. గోపాల్‌గంజ్‌లో ఉన్న తుంగిపుర వద్ద ముజ్బీర్ రెహ్మాన్ సమాధి ఉన్నది. ముజ్బీర్ సమాధి వద్ద మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. నివాళి అర్పించిన తర్వాత కాసేపు మౌనం పాటించారు. బంగబంధు స్మృతి ప్రదేశంలో ఉన్న వివిధ ప్రాంతాలను మోదీ తిరిగి చూశారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా, ఆమె సోదరి షేక్ రెహనాలు కూడా మోదీకి స్వాగతం పలికారు.
బంగబంధు స్మారక కాంప్లెక్స్ వద్ద తొలుత పుష్పగుచ్ఛంతో మోదీకి వెల్కమ్ పలికారు. స్మారక ప్రదేశం వద్ద మొక్కను నాటిన మోదీ.. ఆ తర్వాత విజిటర్స్ బుక్‌లోనూ సందేశం రాశారు. బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న మోదీ.. ఇవాళ ఉదయం జెశోరేశ్వరి శక్తిపీఠాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఓరాకంటి ఆలయంలోనూ ఆయన పూజలు చేశారు.
శనివారం ఉదయాన్నే సట్‌ఖారీ జిల్లా ఈశ్వర్‌పూర్‌లోని జెశోరేశ్వరీ కాళీ టెంపుల్‌ను సందర్శించారు. అక్కడ అమ్మవారికి పూజలు నిర్వహించి చేతితో తయారు చేసిన కిరీటాన్ని తొడిగారు. వెండిపై బంగారం కోటింగ్ వేసిన తీగలను చేతిలో అల్లడం ద్వారా ఈ కిరీటాన్ని తయారు చేశారు. సంప్రదాయ కళారీతిలో ఈ కిరీటాన్ని అల్లడానికి మూడు వారాలకు పైగా సమయం పట్టిందట.
జెశోరేశ్వరీ అమ్మవారికి పూజల అనంతరం మాట్లాడిన ప్రధాని.. తనకు ఇవాళ కాళీ మాత దర్శన భాగ్యం కలిగిందన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచ మానవాళికి ఆ గండం నుంచి విముక్తి కల్పించమని తాను కాళీ మాతను కోరుకున్నట్లు ప్రధాని వెల్లడించారు. బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఆలయ పరిసరాల్లో ఒక కమ్యూనిటీ హాల్‌ను అవసరమని, ఆ హాల్‌ను నిర్మాణాన్ని భారత ప్రభుత్వమే చేపడుతుందని చెప్పారు.
కాళీ మేళా సందర్భంగా బంగ్లాదేశ్ నుంచి, భారత సరిహద్దుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడి తరలివస్తారని, అలా వచ్చే భక్తులకు కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. సామాజిక, మత సంబంధమైన, విద్యా సంబంధమైన పలు కార్యక్రమాలకు ఉపయోగపడేలా కమ్యూనిటీ హాల్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తుఫాన్‌ల లాంటి విపత్తులు సంభవించినప్పుడు కమ్యూనిటీ హాల్ ఒక షెల్టర్‌గా ఉపయోగపడుతుందన్నారు.