గౌతం అదాని సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన యూఎస్ షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ మరో సంచలనానికి తెరలేపింది. ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. జాక్ డోర్సీ (Twitter Co-Founder Jack Dorsey) ఆధ్వర్యంలోని పేమెంట్స్ సంస్థ బ్లాక్ (Block Inc) అక్రమాలకు పాల్పడిందని నివేదికను బయటపెట్టింది. ఈ బ్లాక్ సంస్థ భారీ అక్రమాలు చేసిందని పేర్కొంటూ హిండెన్‌బర్గ్ తన ట్విట్టర్ ఖాతాలో సంబంధిత నివేదిక లింక్‌ను ట్వీట్ చేసింది.
జాక్ డోర్సీ సారధ్యంలోని ఈ బ్లాక్ తన ఖాతాదారుల సంఖ్య ఎక్కువ చేసి, ఖర్చులు తక్కువ చూపి ఇన్వెస్టర్లను మోసగించిందని హిండెన్‌బర్గ్ ఆరోపణలు గుప్పించింది. రెండేండ్లుగా తాము చేసిన పరిశోధనలో `బ్లాక్`లో జరిగిన పలు కీలకాంశాలు గుర్తించామని తన నివేదికలో వెల్లడించింది.
నిబంధనలు అతిక్రమించి, రుణాల పేరిట దోపిడీకి పాల్పడటం, రివల్యూషనరీ టెక్నాలజీ పేరిట కంపెనీ గణాంకాలు పెంచి ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడమే బ్లాక్ వ్యాపార లక్ష్యమని తెలిపింది. బ్లాక్ సంస్థ ఖాతాల్లో 40-75 శాతం వరకు ఫేక్ అని ఆ సంస్థ ఉద్యోగులే తమకు చెప్పారని వివరించింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడి కాగానే ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్ విలువ 18 శాతం పతనమైంది.