London,SEP 18: ఇటీవలే మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు (Queen's funeral ) సోమవారం జరగనున్న సంగతి తెలిసిందే. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బే చర్చిలో (West minister church) క్వీన్ అంత్యక్రియలు భారీ స్థాయిలో జరగబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అంత్యక్రియలకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు చెందిన అధినేతలు, ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇంత భారీ స్థాయిలో జరగబోతున్న కార్యక్రమం కాబట్టి, బ్రిటన్ (Britain) దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. దాదాపు 9 మిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.71 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. క్వీన్ ఎలిజబెత్ (Queen Elizabeth) మరణంతో బ్రిటన్‌లో ఆమె సంతాప దినాలు పది రోజులుగా కొనసాగుతున్నాయి.
సోమవారం జరిగే అంత్యక్రియలకు అతిథులు భారీగా హాజరవుతున్న దృష్ట్యా భద్రత కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాగే అతిథులకు అందించే ఆతిథ్యం, కొత్తగా ఎన్నికైన రాజు కింగ్ ఛార్లెస్ (King Charles) పట్టాభిషేకం వంటి వాటి కోసం ఈ నిధులు ఖర్చవుతాయి. ఇక క్వీన్ మృతికి సంతాపంగా బ్రిటన్‌లో సోమవారం బంద్ పాటిస్తున్నారు. సినిమా హాళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు వంటి వన్నీ బంద్ ఉంటాయి.
ఇప్పటికే అక్కడ సోమవారం నేషనల్ బ్యాంక్ హాలిడే కూడా ప్రకటించారు. కాగా, కొన్ని పబ్బులు, కంపెనీల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్రిటన్ ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంట్ కూడా పనిచేయదు. ప్రజలంతా క్వీన్‌కు నివాళి అర్పించేందుకు వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారవర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాణి అంత్యక్రియల కోసం భారీగా ఖర్చుపెట్టడాన్ని అక్కడి పౌరులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్న సమయంలో ఇంత ఖర్చు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.