Russia-and-Ukrain

New York, February 28: ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం (Russia-Ukraine Conflict) ఐదోరోజు కూడా కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ నగరంపై సోమవారం వైమానిక దాడులు చేస్తామని రష్యా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంశంపై చర్చించేదుకు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (UNGA) అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని రష్యా వీటో అధికారంతో అడ్డుకున్న విషయం తెలిసిందే.

ఇదే అంశంపై చర్చించేందుకు 199 సభ్య దేశాలున్న ఐరాస సర్వప్రతినిధి సభ అసాధారణ, అత్యవసర ప్రత్యేకంగా సమావేశం (UN General Assembly Session) కానుంది. దీనికి సంబంధించి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్‌లో 15 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లతో ఆమోదం లభించింది. అయితే ఈ ఓటింగ్‌కు భారత్‌, చైనా, యూఏఈలు దూరంగా ఉన్నాయి. కాగా, 1950 తర్వాత సాధారణ అసెంబ్లీలో ఇది 11వ అత్యవసర సమావేశవమగా, గత నాలుగు దశాబ్దాల్లో ఇదే మొదటిది కావడం విశేషం.

249 మంది ప్రయాణికులతో బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీకి చేరిన ఐదో విమానం, కొనసాగుతున్న భారతీయుల తరలింపు ప్రక్రియ, ఉక్రెయిన్‌లో 13వేల మంది భారతీయులు

రష్యా సైన్యం జరిపిన దాడితో ఉక్రెయిన్ దేశంలో 352 మంది పౌరులు కూడా మరణించారు.మరో వైపు బెలారస్ సరిహద్దులో రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది.రష్యా సైనిక దాడికి నిరసనగా యూరోపియన్ దేశాలతోపాటు ఉక్రెయిన్, బెల్జియం, ఫిన్లాండ్, కెనడా దేశాలు రష్యా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఇక ఐరోపా దేశాలకు విమానాలను నడిపేది లేదని రష్యా (Russia) విమానయాన సంస్థ ఏరోఫ్లాట్‌ (Aeroflot ) ప్రకటించింది. సోమవారం నుంచి ఈయూలోని అన్ని దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

తదుపరి నోటీసులు వచ్చేవరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపింది. దీంతో బ్రిటన్, లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా, స్లోవేనియా, బల్గేరియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్ వంటి అనేక దేశాల విమానాలపై ఏరోఫ్లాట్‌ నిషేధం విధించింది. ఈ నిషేధం రష్యాకు చెందిన జెట్‌ విమానాలకు కూడా వర్తిస్తుందని ఈయూ వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఈయూలోని 27 దేశాల్లో చాలా వరకు రష్యన్ విమానాలపై నిషేధం విధించింది. దీంతో ఇది ఇప్పటికే అమల్లో ఉన్నట్లయింది.

రష్యాతో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంగీకారం, ఉక్రెయిన్ - రష్యా వార్ కు ఒక ముగింపు వచ్చే అవకాశం, బెలారస్‌లో చర్చలు..

అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై కొత్త ఆర్థిక ఆంక్షలను కూడా ప్రకటించాయి.రొమేనియా నుంచి 249 మంది భారతీయులతో బయలుదేరిన విమానం ఢిల్లీలో దిగింది.ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లోని రెసిడెన్షియల్ భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. అమెరికా అధ్యక్షుడు బిడెన్ ఉక్రెయిన్‌పై సోమవారం నాటో నేతలతో సమావేశం కానున్నారు.యూరోపియన్ యూనియన్ తన భూభాగంలో ల్యాండింగ్, టేకాఫ్, ఎగురుతున్న రష్యన్ విమానాలను నిషేధించింది.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా ఆస్తుల నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలను యూరోపియన్ యూనియన్ నిషేధించింది.ఉక్రెయిన్ రాజధాని కైవ్, ఖార్కివ్‌లలో పేలుళ్లు వినిపించాయని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది.

ఆదివారం మధ్యాహ్నం రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్‌లోకి ప్రవేశించాయి. నగరాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఒక సమయంలో నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు ప్రకటించాయి. అయితే, ఉక్రెయిన్‌ సైన్యం వీరోచిత పోరాటంతో వారి ప్రయత్నం విఫలమైంది. ఉక్రెయిన్‌ సేనలదాటికి ఖార్కీవ్‌ నుంచి రష్యా బలగాలు తోకముడిచాయి. దీంతో ఖార్కీవ్‌ పూర్తిగా ఉక్రెయిన్‌ సైన్యం నియంత్రణలోనే ఉన్నట్టు ప్రాంతీయ గవర్నర్‌ తెలిపారు. ఇక్కడి పోరాట దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ఆదివారం దక్షిణ ఉక్రెయిన్‌లోని రెండు కీలక పోర్టులను రష్యా స్వాధీనం చేసుకొన్నది. కీవ్‌ సమీపంలోని వాసిల్‌కోవ్‌ వద్ద ఒక చమురు డిపోను రష్యా సేనలు పేల్చేశాయి. మరోచోట గ్యాస్‌ పైప్‌లైన్‌ను పేల్చాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని మరో నగరం నోవా కఖోవ్‌కాను స్వాధీనం చేసుకొన్నట్టు రష్యా సేనలు ప్రకటించుకున్నాయి.

యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటివరకు 3.68 లక్ష మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఉక్రెయిన్‌ శరణార్థులను వీసా లేకుండానే పోలాండ్‌ అనుమతిస్తున్నది. విదేశాలకు వలస వెళ్తున్నవారితో ఉక్రెయిన్‌ సరిహద్దులకు జనం పోటెత్తుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించించింది. మైళ్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. రష్యా దాడుల్లో 210 మంది ఉక్రెయిన్‌ పౌరులు మరణించారు. 1100 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్‌ బలగాల చేతిలో 4,300 మంది రష్యా సైనికులు హతమయ్యారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ రక్షణశాఖ తెలిపింది.

రష్యా దాడులను ఆపేలా ఆదేశించాలని కోరుతూ నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఉక్రెయిన్‌ ఆశ్రయించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం నుంచి రష్యాను తొలగించాలని కోరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అత్యవసర సమావేశం నిర్వహించింది.

అంతర్జాతీయంగా వాణిజ్యం, నగదు బదిలీలకు అత్యంత కీలకమైన స్విఫ్ట్‌ నగదు చెల్లింపుల వ్యవస్థ నుంచి రష్యాను తప్పించాలని అమెరికా, ఈయూ నిర్ణయించాయి. రష్యాకు వివిధ దేశాల్లో ఉన్న నిధులను యాక్సెస్‌ చేయకుండా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఆంక్షలు విధించిన రష్యా కంపెనీల ఆస్తులను కనిపెట్టడానికి పశ్చిమ దేశాలు సంయుక్తంగా జాయింట్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశాయి. స్విఫ్ట్‌ అంటే సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలికమ్యూనికేషన్స్‌(స్విఫ్ట్‌). ఇది ప్రపంచంలోనే ప్రధాన బ్యాంకింగ్‌ అనుసంధాన వ్యవస్థ.