
Baghdad, Aug 30: ఇరాక్ రాజధాని బాగ్ధాద్ రణరంగాన్ని తలపిస్తోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు షీతె క్లెరిక్ మొఖ్తదా సదర్ ప్రకటించగానే (Iraq Political Crisis) ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. అలాగే మొఖ్తదా సదర్ తన పార్టీ కార్యాలయాలను సైతం మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగారు. ప్రభుత్వ భవనాన్ని ముట్టడించారు. మరో వైపు రాజధానిలో భారీ ప్రదర్శనలు కొనసాగాయి. మరో వైపు అల్లర్లు చెలరేగగా.. బాగ్దాగ్ గ్రీన్‌జోన్‌లో ఆందోళనకారులపై సైన్యం జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి (12 Killed As Cleric Moqtada Al-Sadr Supporters) చెందారు. దాదాపు వంద మందికిపై గాయాలైనట్లు తెలుస్తున్నది.
గ్రీన్ జోన్‌లో కొందరు బాంబులతో విరుచుకుపడ్డారు. తుపాకీ కాల్పుల మోత మోగించారు.షియా మతాధికారికి మద్దతుగా నిరసన నేపథ్యంలో ఇరాక్ సైన్యం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఇరాక్‌లో కీలకమైన షియా మతాధికారి ముక్తాదా అల్ సదర్ సోమవారం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.బాగ్ధాద్‌లో పరిణామాలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. పరిస్థితులు చేయి దాటిపోకుండా, హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఉండాలని సూచించింది. అగ్రరాజ్యం అమెరికా కూడా బాగ్ధాద్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.
బాగ్దాద్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాకీ సైన్యం కర్ఫ్యూను ప్రకటించింది. షియా మతాధికారి మద్దతుదారులను రాజభవనానికి దూరంగా ఉండాలని, విధ్వంసాన్ని ఆపాలని సైన్యం కోరింది. అయితే, అల్ సదర్ రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఇలానే చాలా సార్లు ప్రకటించారు. ఆయన చర్యలతో దేశంలో ఇప్పటికే అధ్వాన్నంగా ఉన్న పరిస్థితులు మరింత దిగజారే అవకాశాలున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాక్‌లో ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటుకాక రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారీటీ రాకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే ప్రో-ఇరాక్ కో ఆర్డినేషన్ ఫ్రేం వర్క్ అన్ని పార్టీలతో కలిసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముస్తఫా అల్ ఖదేమీని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకుంది. దీన్ని మొఖ్తదా సదర్ మద్దతుదారాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదివరకే పలుమార్లు గ్రీన్ జోన్‌ను ముట్టడించారు. అక్టోబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సదర్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినా మెజార్టీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుపై ఆయన విపక్షాలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.