Tokyo, July 12: రోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వాలట (Laugh). అలా ఉత్తర జపాన్ (Japan) లోని యమగటా స్థానిక యంత్రాంగం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రజలందరూ రోజులో కనీసం ఒక్కసారైనా పగలబడి నవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. బిగ్గరగా నవ్వితే, గుండె సమస్యలు తగ్గుముఖం పడుతాయని వాళ్లు చెప్తున్నారు. ఈ మేరకు యమగటా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల ‘లాఫర్ స్టడీ’ని ఉదహరిస్తున్నారు. ఆ స్టడీ ప్రకారం.. 40 ఏండ్ల కంటే తక్కువ వయసున్న 17,152 మంది నవ్వుపై పరిశోధనలు చేశారు. వారంలో ఒక్కసారి కూడా బిగ్గరగా నవ్వని వారికి గుండె సమస్యలు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించారు. రోజూ బిగ్గరగా నవ్వేవారికి గుండె సమస్యలు పెద్దగా ఎదురుకాలేదని తెలిపారు.
ఎందుకిలా??
బిగ్గరగా నవ్వితే, శరీరంలోని నాడీలు, కండరాలు ఉత్తేజితమవుతాయని, రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మానసిక-శారీరక ప్రశాంతత కలుగుతుందని అంటున్నారు. గుండె సమస్యలు ఉన్నవారికి ‘లాఫింగ్ థెరపీ’ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.