Port-au-Prince, July 7: హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మొయిజ్‌ను తన అధికారిక నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య (Haitian President Assassinated) చేశారు. అధ్యక్షుడు జొవెనల్ మొయిసే ఇంట్లోకి చొరబడ్డ కొందరు గుర్తుతెలియని దుండగులు అధ్యక్షుడితోపాటు ఆయన భార్యపై తుపాకులతో దాడికి (Haitian President Jovenel Moise assassinated) పాల్పడినట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్ వెల్లడించారు. ఈ దాడిలో అధ్యక్షుడు మృతిచెందగా ఆయన భార్య, దేశ మొదటి మహిళ మార్టిన్ మొయిసే తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధ్యక్షుడు మరణించిన నేపథ్యంలో తానే దేశానికి ఇంచార్జీగా మారినట్లు ఆయన వెల్లడించారు
ఈ దాడిని జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. ఇదో దుర్మార్గపు, అమానవీయ చర్యగా అభివర్ణించారు. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో పాటు గ్యాంగ్ వార్‌లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే జోవెనల్ మొయిసే హత్యకు గురయ్యారు. అధ్యక్షుడి హత్యతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగనున్నట్లు సమాచారం అందుకున్న ఆ దేశ పోలీసు శాఖ.. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొంది. హత్యపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది.
ప్రజలంతా సంయమనంతో ఉండాలని జోసెఫ్ అభ్యర్థించారు. పోలీసులు, ఆర్మీ ప్రజల భద్రత చూసుకుంటుందన్నారు. ఇంగ్లీష్, స్పానిష్ భాషలో మాట్లాడే వ్యక్తులు అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు ప్రధాని జోసెఫ్ చెప్పారు. 2018 నుంచి ఆ దేశాధ్యక్షుడి మొయిజ్ కొనసాగుతున్నారు. అధ్యక్షుడి హత్యతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగే అవకాశం ఉన్నట్లు ఆ దేశ ఇంటెలిజన్స్ విభాగం హెచ్చరించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తాత్కాలిక ప్రధాని క్లౌడే జోసెఫ్ వెల్లడించారు. హత్యపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.