Kenya Cult Deaths: ఏసు ప్రభువు దగ్గరకు వెళ్లాలంటే మీరంతా ఆకలితో చచ్చిపోవాలి, పాస్టర్ మాయమాటలు నమ్మి 201 మంది మృతి, చిన్న పిల్లలు కొన ఊపిరితో ఉండగానే ఖననం
Kenya Cult Deaths. (Photo Credits: Twitter@krassenstein)

Nairobi, May 13: కెన్యాలో పాస్టర్ మాటలు నమ్మి కడుపు మాడ్చుకుని ప్రాణాలు తీసుకున్న వారి సంఖ్య 201కు చేరుకుంది. మరో 600 మందికిపైగా ప్రజల ప్రాణాలను పెను ప్రమాదంలో పడేశాయి. ఈ దారుణ ఘటనకు పాల్పడిన పాస్టర్‌ పాల్‌ మెకంజీ, అతని భార్యతో పాటు ఇప్పటి వరకు 26 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొంతమంది పిల్లలను కొన ఊపిరితో ఉండగానే ఖననం చేశారని పోలీసులు విచారణలో వెల్లడైంది. ఇంకా సుమారు 610 మంది జాడ ఇంకా తెలియడం లేదు. వారి కోసం గాలిస్తున్నారు. పాస్టర్‌ చెప్పిన వాక్కులు విని మొత్తం 800 మందికి పైగా ప్రజలు చచ్చేంత వరకు ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నారు.అలాగే ఆహారం తీసుకోకుండా దీక్ష చేసి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలా మరణించిన వారిని స్థానిక అడవిలో పాతిపెట్టడంతో ఈ విషయం ఒక్కసారిగా బయటకొచ్చింది.

జీసస్‌ను కలుసుకోవాలని కఠిన ఉపవాసం, ఆకలితో అలమటించి 47 మంది మృతి, కెన్యాలో విషాదకర ఘటన వెలుగులోకి..

ఒకప్పుడు టాక్సీ డ్రైవర్‌గా పనిచేసిన మెకంజీ పాస్టర్‌ అవతారమెత్తాడు. ఏప్రిల్‌ 15 నాటికి ప్రపంచం అంతమైపోతుందని, ఆలోగా ఆకలితో చనిపోతే జీసస్‌ను కలుస్తారని ప్రచారం నిర్వహించాడు. ప్రజలు అతన్ని నమ్మి ఆకలితో చనిపోయారు. అలా చనిపోయిన వారి సామూహిక సమాధి ఒకదాన్ని మొదట ఏప్రిల్‌లో గుర్తించారు. వేర్వేరుచోట్ల ఇప్పటి వరకు 201 మంది మృతదేహాలను వెలికితీశారు.

అసలు కథ ఏంటి ?

దక్షిణ కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతమైన కిలిఫీలో 800 ఎకరాల్లో ఉన్న ప్రాపర్టీలో పాల్‌ మెకంజీ అనే పాస్టర్‌ 2019 నుంచి ఉంటున్నాడు. అక్కడే ఇంటర్నేషనల్‌ చర్చి ఆప్‌ ది గుడ్‌ న్యూస్‌ అనే చర్చిని నడుపుతున్నాడు. ఆ చర్చికి వచ్చే భక్తులు పాస్టర్‌ పాల్‌ మెకంజీ చెప్పే మాటలను నమ్మి ప్రాణాలను తీసుకున్నారు. ఆహారం తీసుకోకుండా తీవ్రమైన ఆకలితో అలమటించి మరణిస్తే జీసెస్‌ను కలిసే అదృష్టం వస్తుందని చర్చికి వచ్చే భక్తులకు పాల్‌ మెకంజీ ఉద్బోధ చేశాడు. పాస్టర్‌ చెప్పిన మాటలకు ప్రభావితమైన వందలాది మంది ఉపవాస దీక్షలు చేయడం మొదలుపెట్టారు.

సూడాన్‌లో రోడ్ల మీద ఎటుచూసినా శవాలే, భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచన, భారత ఎంబసీకి ఎవరూ వెళ్లద్దని ఆదేశాలు

రోజుల తరబడి అలాగే ఆహారం తీసుకోకుండా ఉండటంతో తీవ్రంగా ఆరోగ్యం క్షీణించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలా మరణించిన వారిని అక్కడే అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. దీంతో ఈ వార్త బయటకు రావడంతో కెన్యా ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఈ క్రమంలోనే గత నెలలో పాస్టర్‌ పాల్‌ మెకంజీని పోలీసులు అరెస్టు చేశారు. మెకంజీ భార్యతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన మృతదేహాల వెలికితీత మొదలుపెట్టారు. ఈ క్రమంలో 100కిపైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు. శనివారం కూడా 22 మృతదేహాలు బయటపడ్డాయి. ఈ మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించగా.. వీరిలో చాలామంది ఆహారం తీసుకోకపోవడంతో మరణించినట్లు తెలిసింది. మరికొంతమంది గొంతు నులమడం, ఆయుధాలతో దాడి చేయడం వల్ల మరణించినట్లు గుర్తించారు.

పాల్‌ మెకంజీని అరెస్టు చేయడంతో తమ దీక్షను భగ్నం చేస్తారేమోనని భయపడ్డ వందలాది మంది భక్తులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 610 మంది మిస్సయ్యారని కోస్ట్‌ రీజియన్‌ కమిషనర్‌ రోడ వెల్లడించారు. దీంతో వాళ్లంతా రహస్య ప్రాంతంలోకి వెళ్లి తమ ఉపవాస దీక్షను కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మిస్సయిన వారిని రక్షించేందుకు అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో స్పందించారు. దీనిపై విచారణ జరిపించి నివేదిక అందించాలని స్పెషల్‌ ఎంక్వైరీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే దేశంలో మరెక్కడైనా ఇటువంటివి ఆచరిస్తున్నారేమో గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.