Kim Jong Un's Health: కిమ్ బతికే ఉన్నాడని వార్తలు, దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ, ఆయన ఆరోగ్య వదంతులను కొట్టివేసిన అమెరికా, దక్షిణ కొరియా దేశాలు
North Korean leader Kim Jong Un | (Photo Credits: Getty images)

Seoul, April 27: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం సరిగా లేదని కొందరు అంటే, ఆయన చనిపోయారని మరికొందరు వాదిస్తున్నారు. అయితే ఉత్తర కొరియా ప్రభుత్వం (North Korea Govt) నుంచి కిమ్ ఆరోగ్యంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన రాసినట్లుగా లేఖ బయటకు వచ్చింది. కిమ్ జోంగ్ ఉన్ 'బ్రెయిన్ డెడ్' అయ్యారా? ఉత్తర కొరియా దేశాధినేత ఆరోగ్య పరిస్థితిపై వార్తలు, గత కొంతకాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటోన్న కిమ్, ఆ దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పులు

ఉత్తర కొరియా ప్రభుత్వం ఏప్రిల్‌ 27న దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేరు మీద ఓ లేఖను విడుదల చేసింది. దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం (South Africa Freedom Day 2020) సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ వెలువడింది. దీనిని స్వయంగా ఉత్తర కొరియా అధినేత పంపిన లేఖ అని ఆ దేశ మీడియా ఓ కథనం ప్రచురించింది. దీంతో కిమ్‌ క్షేమంగానే ఉన్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆయన ఆరోగ్య వదంతులను (Kim Jong Un's Health) అమెరికా, దక్షిణ కొరియా దేశాలు ఖండించాయి. కిమ్‌ ఆరోగ్యంపై తమకు తమకు క్లారిటీ ఉందని ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నట్లు యూఎస్‌ తెలిపింది. ఇక దక్షిణ కొరియా సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కిమ్‌ బతికే ఉన్నారని, అతని ఆరోగ్యానికి ఢోకా లేదని ఆ దేశం అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్‌ చుంగ్ వెల్లడించారు.

సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం అన్ని పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది’ అని పేర్కొన్నారు. ఉత్తర కొరియాకు (North Korea) తూర్పు ఉన్నత ప్రాంతంలోని వాన్‌సన్‌లో కిమ్‌ ఏప్రిల్‌ 13 నుంచి ఉంటున్నట్టు చుంగ్‌ ఇన్‌ తెలిపారు. అతని ఆరోగ్యంపై గాని, మరే విషయాల్లో గాని ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేవని అన్నారు.

కాగా ఏప్రిల్‌ 11 జరిగిన తమ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొన్న కిమ్‌ ఆ తర్వాత నుంచి పత్తా లేకుండా పోయారు. అయితే, ఫైటర్‌ జెట్‌ విమానాలను పరిశీలించేందు కిమ్‌ వెళ్లాడని ఆ దేశ మీడియా తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న కిమ్‌ తన తాత ఇల్‌ సంగ్‌ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్‌ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. అయితే ఇంతకుముందు 2014లో కిమ్‌ ఆరువారాలపాటు కనిపించకుండా పోయారు. అతని కాలి మడమకు శస్త్ర చికిత్స జరిగిందని ఆదేశ గూఢచార సంస్థ తర్వాత తెలిపింది.

దేశంలోని రిసార్ట్‌ టౌన్‌లో కిమ్‌ కుంటుంబ సభ్యులకు మాత్రమే సేవలందించే ప్రత్యేక ట్రైన్‌ ఏప్రిల్‌ 21, 23 తేదీల్లో కనిపించినట్టు ఉత్తర కొరియాలో పనిచేస్తున్న వాషింగ్టన్‌ బేస్డ్‌ పర్యవేక్షణ ప్రాజెక్ట్ (38 నార్త్‌) తెలిపింది. శాటిలైట్‌ దృశ్యాల్లో లీడర్‌షిప్‌ స్టేషన్‌లో ఆ ప్రత్యేక ట్రైన్‌ ఆచూకీ బయటపడిందని పేర్కొంది. ఆ రైలులో కిమ్‌ ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయడింది. ఒకవేళ కిమ్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేని పక్షంలో రైలు అక్కడ ఉండే అవకాశమే లేదని వెల్లడించింది.

ఇదిలావుండగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని చైనా పేర్కొంది. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్‌ షాంగ్‌.. కిమ్ గురించి చెప్పేందు‌కు తమ వద్ద సమాచారం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే కిమ్‌ ఆరోగ్యం మెరుగుపడని పరిస్థితుల్లో ఆయన సోదరి, వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియాలో కీలక నేతగా ఎదిగిన కిమ్‌ యో జాంగ్‌ దేశాధినేతగా బాధ్యతలు స్వీకరిస్తారంటూ అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి.