Seoul, April 21: శస్త్రచికిత్స తర్వాత ఉత్తర కొరియా (North Korea) దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు బహిర్గతమయ్యాయి. గత కొంతకాలంగా కిమ్ నుంచి ఎలాంటి అలికిడి లేదు, బాహ్య ప్రపంచానికి అతడు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏప్రిల్ 15న తన తాత పుట్టినరోజు వేడుకలకు కూడా కిమ్ హాజరుకాలేదు. ఏప్రిల్ 15 ఉత్తర కొరియా యొక్క అతి ముఖ్యమైన సెలవుదినం, దేశ వ్యవస్థాపక తండ్రి కిమ్ ఇల్ సుంగ్ జన్మించిన వార్షికోత్సవం. ఈ పరిణామాలన్నీ కిమ్ ఆరోగ్య పరిస్థితిపై వెలువడుతున్న ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స తీసుకున్నారు. ఈ సర్జరీ తర్వాతే అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన NBC న్యూస్ రిపోర్టర్ ఒకరు కిమ్ 'బ్రెయిన్ డెడ్' అయ్యారని ట్వీట్ చేశారు. హార్ట్ సర్జరీ అనంతరం కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లారని రిపోర్ట్ చేశారు, ఆ వార్త వెంటనే వైరల్ అయింది. అయితే కొద్దిసేపటికే ఆమె తన ట్వీట్‌ను తొలగించి, ఉత్తర కొరియా నాయకుడి ఆరోగ్యం గురించి ధృవీకరణ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.
Here's what the NBC reporter tweeted:
Don’t worry i gotcha pic.twitter.com/hgl6Trv9dd
— Chris Raab (@ChrisRaab3) April 21, 2020
ఉత్తర కొరియాలో ఏది జరిగినా అది బయట ప్రపంచానికి తెలియదు. అయితే ఆ దేశానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలలో నేతలు పాల్గొనని సందర్భంలో ఏదైనా విపత్తు జరిగి ఉండవచ్చు అనే సంకేతాలను ప్రపంచం గమనించింది. ఇలాగే 2008 లో ఒకసారి ఉత్తర కొరియా 60వ వార్షికోత్సవాన్ని జరుపుకునే కవాతులో కిమ్ జోంగ్ ఇల్ లేకపోవడం తరువాత అతనికి హార్ట్ స్ట్రోక్ ఉందని వెల్లడైంది, అప్పట్నించి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ పోయి 2011లో మరణించారు.
మళ్ళీ ఇప్పుడు కిమ్ జోంగ్ ఉన్ యొక్క సోదరి దేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే స్థానంలో నియమింపబడినట్లు అక్కడి మీడియా ఆదివారం నివేదించింది. ఉత్తర కొరియాలో పలు కీలక వ్యవస్థల్లో మార్పులు, చేర్పులు వేగంగా చోటు చేసుకున్నాయి. దీనిని బట్టి ఆ దేశంలో ఏదో పెద్ద విపత్తే సంభవించి ఉండవచ్చు అని వివిధ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.