
సెంచరీలు కొట్టే వయస్సు మాది.. బౌండరీలు దాటే మనసు మాది అని వర్ణించినట్లుగా ఓ 16 అణాల ఇంగ్లీష్ అమ్మాయి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల బౌండరీలు దాటేసింది (Beyond the boundaries). అప్పటికీ ఆమె వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. ఇంకేముంది, ఈ ఘనత సాధించిన అతిచిన్న వయస్సురాలిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) సాహో అంటూ ఆమెకు వందనం చేసింది.
అమెరికా దేశం (American), కాలిఫోర్నియాలోని నెవాడా సిటి అనే ఓ చిన్న పట్టణానికి చెందిన లెక్సీ ఆల్ఫోర్డ్ (Lexie Alford) అనే 21 ఏళ్ల యువతి అప్పటికే 195 దేశాలు చుట్టి వచ్చి అమెరికన్లకు అంతగా అనుమతి లేని ఉత్తర కొరియా (North Korea) దేశంలో కూడా మే 31, 2019న తన 196వ దేశాటన విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రపంచం అంతా చూడాలనే తన కలను సాకారం చేసుకుంది.
ఎవరైనా పరాయి దేశం వెళ్లాలంటే అక్కడ ఎలా ఉంటుందో, మనవాళ్ళంటూ ఎవరూ ఉండరు, ఇదంతా సాధ్యమయ్యే పనేనా అని ఎన్నో రకాల భయాలు ఉంటాయి. అయితే ఈ ప్రపంచం ఏమంత భయంకరమైనది కాదు, ఆయా దేశాల్లో వివిధ రకాల సంస్కృతులు ఉండచ్చు లేదా రాజకీయపరమైన గొడవలు ఉండొచ్చు కానీ మనుషులంతా ఒక్కటే అని చాటిచెప్పేందుకే తన ఈ మహత్తర ప్రయాణాన్ని ప్రారంభించినట్లు లెక్సీ తన బ్లాగులో రాసుకున్నారు.
లెక్సీ తల్లిదండ్రులకు సొంతంగా ట్రావెల్ ఏజెన్సీ (Adventure Travel) ఉండటంతో ట్రావెలింగ్ పైన ఆసక్తి పెంచుకుంది. అంతేకాకుండా వారు తనని స్కూల్ వయసు నుండే ఇంటికి దూరంగా, స్వతంత్రంగా బ్రతికేలా ప్రోత్సహించారని. ఇదే తనలో ఆత్మవిశ్వాసం నింపిందని లెక్సీ చెప్తుంది. యాత్రకు అవసరమైన డబ్బును కూడా లెక్సీ తన సొంతంగా సంపాదించుకుంది, దొరికిన ప్రతీ పనిచేసింది. 12 ఏళ్ల వయసు నుంచే పొదుపు చేయడం ప్రారంభించింది. ప్రయాణాల్లో భాగంగా వివిధ బ్రాండ్లను అనుసంధానం చేస్తూ వాటితో ఒప్పందాలను కుదుర్చుకుంది. మిగతా యాత్రికులకు ఫోటోగ్రాఫ్స్ తీస్తూ, అక్కడి విశేషాలను బ్లాగుల్లో పొందుపరుస్తూ వాటిని ప్రింటౌట్స్ తీసి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించేదట. ఎక్కడికెళ్లినా బడ్జెట్ లోనే ఉండటం, బడ్జెట్ లోనే తినడం ద్వారా తన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోకుండా జాగ్రత్త పడేదానినంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇలా ఆమెకు 18ఏళ్లు వచ్చేసరికే 72 దేశాలు చుట్టేసింది. తనను చూసి తన చుట్టూ ఉన్న మిగతావారు కూడా ఇన్స్పైర్ అవుతుండటంతో ఇక తన ప్రయాణం ఎప్పటికీ ఆగకూడదని అప్పుడే డిసైడైందట.
ఒక ఆడపిల్లను ఒంటరిగా బయటకు పంపాలంటే భయపడే ఈరోజుల్లో ఒక అమ్మాయి అలాంటి కట్టుబాట్లను అన్నింటిని తెంచుకుంటూ ఒంటరిగా ప్రపంచ దేశాలు తిరిగిరావటం నిజంగా అభినందనీయనమే కదా? హాట్సాఫ్ టూ లెక్సీ ఆల్ఫోర్డ్.