Beijing, AUG 25: ప్రపంచం మొత్తం కొవిడ్ (Covid 19) ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా.. చైనా మాత్రం అనేక నెలలపాటు జీరో కొవిడ్ (Zero Covid) విధానాన్ని అనుసరించింది. దీనిపై అక్కడ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం కావడంతో గతేడాది డిసెంబర్‌లో కొవిడ్ ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేసింది. దీంతో ఊహించని స్థాయిలో కొవిడ్ మరణాలు సంభవించాయనే వార్తలు వచ్చాయి. జీరో-కొవిడ్ విధానం ఎత్తేసిన అనంతరం రెండు నెలల్లోనే సుమారు 20 లక్షల అదనపు మరణాలు సంభవించి ఉండొచ్చని అమెరికా అధ్యయనం అంచనా వేసింది. చైనాలో కొవిడ్ మరణాలకు (China Covid deaths) సంబంధించి అక్కడి యూనివర్సిటీలు, స్థానిక సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారంపై అమెరికా సియాటెల్‌లోని ఫ్రెడ్ హట్‌షిన్‌సన్ క్యాన్సర్ సెంటర్ ఓ అధ్యయనం జరిపింది.
చైనాలోని అన్ని ప్రావిన్సుల్లో డిసెంబర్ 2022-జనవరి 2023 మధ్యకాలంలో అన్ని కారణాల వల్ల 18.7లక్షల అదనపు మరణాలు (30ఏళ్ల వయసు పైబడిన వారిలో) సంభవించాయని గుర్తించింది. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కొవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో 60వేల మంది మృతి చెందారని, చైనా అధికారికంగా ప్రకటించిన దానికంటే చాలా అధిక స్థాయిలో ఇవి ఉన్నాయని తెలిపింది.
చైనాలో జీరో కొవిడ్ విధానం (Zero Covid) ఎత్తివేతకు సంబంధించి జరిపిన అధ్యయనంలో అనేక అంశాలు వెల్లడయ్యాయని.. కొవిడ్-19 వ్యాప్తి పౌరుల మరణాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇదెంతో ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 70లక్షల మంది కొవిడ్ మరణాలు సంభవించగా.. చైనాలో 1.21లక్షలు మాత్రమే చోటుచేసుకున్నాయి. అయితే, చైనాలో కొవిడ్ మరణాల సమాచారంపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రావడంతో.. రోజువారీగా అందించే సమాచారాన్ని డ్రాగన్ కొంతకాలం క్రితం నిలిపివేసింది.