
Mugu, Oct 13: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో (Nepal Bus Crash) 32 మంది మరణించారు. మంగళవారం మధ్యాహ్నం బస్సు లోయలో పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కారణాలు తెలియరాలేదు. బ్రేక్‌లు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని (Several Injured in Bus Accident in Nepal) రెస్క్యూ దళాలు రక్షించాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ డజను మందికి చికిత్సను అందించారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు.
నేపాల్‌లో పండుగ సీజన్ నడుస్తోంది. చాలా మంది పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రయాణాలు చేస్తున్నారు. ప్రమాదం సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో ఎవరికీ తెలియదు. కానీ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నేపాల్‌గంజ్ నుంచి గమ్‌గాధి వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో గల పినాఝరి నదిలో ప్రమాదవశాత్తు పడింది. ఛాయానాథ్ రారా మున్సిపాలిటీ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో సహాయక చర్యల కోసం నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ సుర్ఖెట్ నుండి పంపబడింది. తలపై తీవ్ర గాయాలు అయిన 10 మందిని కోహల్‌పూర్ మెడికల్ కాలేజీకి, మరో ఐదుగురిని చికిత్స కోసం నేపాల్‌గంజ్‌లోని నర్సింగ్ హోమ్‌కు పంపినట్లు నేపాల్‌గంజ్ ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ గార్డ్ ఇన్‌ఛార్జ్ సంతోష్ షా తెలిపారు. కాగా ముగు అందమైన రారా సరస్సుకి ప్రసిద్ధి చెందింది, ఇది ఖాట్మండుకు వాయువ్యంగా 650 కిమీ దూరంలో ఉంది.