Hyderabad, Nov 28: ఉన్నత విద్య కోసం అమెరికా (America) వెళ్లేందుకు సిద్ధమవుతున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశం కొత్త నిబంధనలు విధించింది. వీసా (Visa) దరఖాస్తు చేసుకొనేటప్పుడు పాటించాల్సిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్టు సోమవారం ఎక్స్ లో తెలిపింది. ఈ నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు పేర్కొన్నది. ఎఫ్, ఎం, జే వీసాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ సొంత పాస్ పోర్టు (Passport) నంబర్‌తో ప్రొఫైల్ తయారుచేసి పంపాలని సూచించింది.
తప్పుడు పాస్ పోర్ట్ నంబర్ సమర్పిస్తే..
తప్పుడు పాస్ పోర్ట్ నంబర్ సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరించటంతోపాటు డిపాజిట్ చేసిన డబ్బును కూడా తిరిగి ఇవ్వబోమని స్పష్టంచేసింది. ఎఫ్, ఎం వీసా కోసం దరఖాస్తు చేసేవాళ్లు ఎక్స్ చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్, స్టూడెంట్ సర్టిఫైడ్ ప్రోగ్రాంలో తప్పనిసరిగా ఎన్ రోల్ చేసుకోవాలి. జే వీసాకు దరఖాస్తు చేసేవాళ్లు అమెరికా విదేశాంగశాఖ గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్ పొంది ఉండాలి. వీసా అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే ప్రొఫైల్ సిద్ధం చేసుకొన్నవారు తమ పాస్ పోర్ట్ అసలైన నంబర్ తో ఆ దరఖాస్తులను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.