New Delhi, April 26: ఎదైనా ఆరోగ్యసమస్య వస్తే డాక్టర్లు చేసే ట్రీట్‌మెంట్‌లో ఇంజెక్షన్లదే కీలక పాత్ర. ఇన్‌ఫెక్షన్లను నయం చేసేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్ ను, మిగిలిన మెడిసిన్ ను ఇంజెక్షన్ (injections) ద్వారానే అందిస్తారు. అయితే ఇంజెక్షన్లు అంటే చాలామంది భయపడుతుంటారు. వాటివల్ల కలిగే నొప్పి భయానికి సమస్యలను దాచి పెడుతుంటారు. అలాంటివారికోసం అమెరికా పరిశోధకులు అద్భుతమైన ఆవిష్కరణ చేశారు.సూది(Needle) గుచ్చకుండానే చర్మం నుంచి మెడిసిన్ ఇంజెక్ట్ చేసే విధానాన్ని ఆవిష్కరించారు. దీనికోసం సులువుగా చర్మానికి తొడుక్కునే ఓ ప్యాచ్(Wearable patch) లాంటి డివైజ్‌ను రూపొందించారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు. ఈ ప్యాచ్‌కి డ్రగ్స్ జోడించి చర్మం గుండా శరీరంలోకి పంపేలా డిజైన్ చేశారు. సూది గుచ్చాల్సిన అవసరం లేకుండానే మందును చర్మం పొరల్లోకి పంపడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం అనారోగ్యాలను ఇంజెక్షన్లు లేదా మెడిసిన్‌తో నయం చేసుకుంటున్నాం. ఈ కొత్త విధానంతో ఇంజెక్షన్ల నొప్పిలేకుండానే ట్రీట్‌మెంట్ ఇవ్వనున్నారు. అంతేకాదు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా...ఈ ప్యాచ్‌ల ద్వారానే మెడిసిన్‌ను కావాల్సిన ప్రాంతానికి అందించవచ్చు (Painless drug). ఈ ప్యాచ్ అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో దళసరిగా ఉండే చర్మం పైపొరలో చిన్న చిన్న ఛానల్‌లను ఏర్పాటు చేస్తుంది. తర్వాత నొప్పిలేకుండా ఈ మార్గాల గుండా డ్రగ్‌ను లోపలికి పంపిస్తుంది. అనంతరం టార్గెట్ ఏరియాపై డ్రగ్ ప్రభావం చూపేలా చూసుకుంటుంది.
సన్‌స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్‌లలో ఉండే బీ విటమిన్ అయిన నియాసినమైడ్‌ను మసాచుసెట్స్ పరిశోధకులు ప్రయోగాత్మకంగా పరిశీలించి చూశారు. అల్ట్రాసౌండ్ ప్యాచ్ సహాయంతో శరీరంలోకి దీనిని చొప్పించి టెస్ట్ చేశారు. ఇది మంచి ఫలితాలను అందించింది. చర్మంలోకి డ్రగ్ వెళ్లే నిష్పత్తితో పోల్చుకుంటే ఈ విధానంలో డ్రగ్ దాదాపు 36 రెట్లు మెరుగ్గా పనిచేసిందని పరిశోధకులు వెల్లడించారు. మైక్రోనీడిలింగ్ ప్రాసెస్‌లో డ్రగ్స్‌ని (Painless drug) చొప్పించడానికి ఆరు గంటలు పడితే, ఈ విధానం కేవలం అరగంటే తీసుకుందని తెలిపారు.
తేలికపాటి బరువు కలిగిన ఈ ప్యాచ్‌ను చర్మంపై సులువుగా (wearable patch)ధరించవచ్చు. ఇది పైజోఎలక్ట్రిక్ ట్రాన్స్‌డ్యూసర్స్‌తో ఎంబెడ్ అయి ఉంది. ఎలక్ట్రిక్ కరెంట్‌ను మెకానికల్ ఎనర్జీగా మార్చేందుకు ఇది సహాయపడుతుంది. ఒకసారి యాక్టివేట్ కాగానే ఈ ట్రాన్స్‌డ్యూసర్స్ ప్రెజర్‌ను జనరేట్ చేస్తాయి. చర్మ కణాలను చెల్లాచెదురు చేసి డ్రగ్ లోనికి వెళ్లేలా మైక్రో రూట్లను ఏర్పరుస్తాయి. దీంతో మెడిసిన్ శరీరంలోకి వెళ్తుంది.
ప్రస్తుతానికి కేవలం చర్మం లోపలికి మందు పంపించగలిగే విధంగానే ఈ డివైజ్‌ను తీర్చిదిద్దారు. భవిష్యత్తులో శరీరంలోని రక్తనాళాల్లోకి డ్రగ్ వెళ్లే విధంగా దీన్ని మాడిఫై చేయనున్నారు. ఒకసారి ఈ ప్యాచ్ అందుబాటులోకి వస్తే ప్రొజెస్టిరాన్ వంటి హార్మన్లను సింపుల్‌గా శరీరంలోని డెలివరీ చేసేందుకు వీలు కలుగుతుంది. అంతేగాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స జరిపేలా ఈ తరహా డివైజ్‌లను తయారు చేయొచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశోధకులు పరిశీలిస్తున్నారు.