Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Washington, Dec 21: అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కోరలు (Omicron Scare in US) చాస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కారణంగా అమెరికాలో మొదటి మరణం నమోదైంది. టెక్సాస్‌లోని హారిస్‌ కౌంటిలో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు (US confirms first Omicron death) కౌంటీ ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, సదరు వ్యక్తి ఇప్పటి వరకు టీకా తీసుకోలేదని, అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని డెయిలీ మెయిల్ వెల్లడించింది. కాగా ఇంతకు అతడు రెండు సార్లు కొవిడ్‌ బారినపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. కౌంటీ మెజిస్ట్రేట్‌ లీనా హిడ్గాలో కరోనా కొత్త వేరియంట్‌ (Omicron Scare in America) కారణంగా ఒకరు మృతి చెందారని, ఇదే ఒమిక్రాన్‌ కారణంగా నమోదైన తొలి మరణమని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 18తో పూర్తయిన వీక్లీ సీక్వెన్సింగ్ డేటా ఆధారంగా అమెరికాలో కరోనా కేసుల్లో 73శాతం ఒమిక్రాన్‌ వేరియంటే కారణమని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సోమవారం పేర్కొంది. గత నెలాఖరులో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ రోజు రోజుకు ప్రపంచదేశాలకు విస్తరిస్తున్నది. ఇంతకు ముందు బ్రిటన్‌లో తొలి మరణం నమోదవగా.. ఇప్పటి వరకు 12 మంది మృత్యువాతపడ్డారు. 104 మంది వరకు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరినట్లు బ్రిటన్‌ ఉప ప్రధాని డొమినిక్‌ రాబ్‌ పేర్కొన్నారు.

యూకేలో చేయిదాటుతున్న పరిస్థితులు, ఒక్కరోజే 10వేల ఒమిక్రాన్ కేసులు, యూరప్ దేశాల్లో శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి, పలు చోట్ల మళ్లీ లాక్‌డౌన్ ఆంక్షలు

మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో కరోనా కలకలం రేగింది. శ్వేతసౌధంలో కరోనా కేసు వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం అధ్యక్షుడు జోబైడెన్ తో కలిసి ప్రయాణించిన తన టీమ్ లోని ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా బారిన పడ్డ సదరు ఉద్యోగి బైడెన్ వద్ద దాదాపు 30 నిమిషాలు ఉన్నారని గుర్తించారు. దీంతో బైడెన్ కు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. రేపు మరోసారి బైడెన్ కు పరీక్షలను నిర్వహించనున్నారు.

క్రిస్మ‌స్ పండుగ వేళ జ‌రిగే ప్ర‌యాణాల‌తో ఒమిక్రాన్ వేరియంట్ మ‌రింత విస్తృతంగా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉన్న‌ట్లు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ తెలిపారు. అసాధార‌ణ‌రీతిలో ఒమిక్రాన్ వ్యాపిస్తున్న‌ట్లు చెప్ప‌డానికి సందేహించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. మీట్ ద ప్రెస్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాపిస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ అమెరికా ప్ర‌భుత్వానికి ఆంథోనీ ఫౌసీ దిశానిర్దేశం చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఒమిక్రాన్ వ్యాపిస్తున్న తీరును గ‌మ‌నిస్తే అది దేశ ఆరోగ్య‌సేవ‌ల‌పై పెను ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ ఇప్పుడు ఉన్న ప‌రిస్థితులే కొన‌సాగితే, అప్పుడు హాస్పిట‌ళ్ల‌పై వ‌త్తిడి మ‌రింత పెరుగుతంద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ మాస్క్‌లు ధ‌రించాల‌ని, సోష‌ల్ డిస్టాన్స్ పాటించాల‌న్నారు. వ్యాక్సిన్లు, బూస్ట‌ర్ డోసులు తీసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల్ని కోరారు.

ఒమిక్రాన్‌ (Omicron) వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా తమ పౌరులు అమెరికాకు వెళ్లడాన్ని (Travel Ban) నిషేధించాలని ఇజ్రాయెల్‌ (Israel) నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. దీనిపై ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ సానుకూల నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. అగ్రరాజ్యాన్ని రెడ్‌ లిస్ట్‌లో పెట్టాలని సూచించింది.