Coronavirus Vaccine (Photo Credits: ANI)

London, July 21: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ (COVID-19 Vaccine) కోసం ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల్లో 140కి పైగా ప్రయోగాలు కొనసాగుతుండగా.. ఆక్స్‌ఫర్డ్ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌పై ఎక్కువ మంది నమ్మకం పెట్టుకున్నారు. ఈ నమ్మకానికి మరింతగా ముందుకు తీసుకువెళుతూ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు (Oxford COVID-19 Vaccine Trials) ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్‌లో ముందడుగు, హైదరాబాద్‌లో నిమ్స్‌లో మానవులపై తొలి ప్రయోగం, 28 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో డోస్‌ తీసుకున్న వ్యక్తి

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సురక్షితమని, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వైరస్‌ను బాగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. వ్యాక్సిన్ (Oxford Vaccine) తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి పెరిగిందని తేలింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీస్, వైట్‌సెల్స్ పెరిగినట్లు ఆక్స్‌‌ఫర్డ్ తెలిపింది. ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకు క్లినికల్ ట్రయల్స్ సాగినట్లు ప్రకటించింది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ అధ్యయనాన్ని ‘ది లాన్సెట్ మెడికల్ జర్నల్‌’లో ప్రచురించింది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది.

Tweet by Richard Horton: 

ఈ మేరకు మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. మరిన్ని ఫలితాల కోసం చివరి దశగా వృద్ధులపై ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరి వరకు ప్రయోగాల పూర్తి ఫలితాలు వస్తాయని ఆక్స్‌ఫర్డ్ పేర్కొంది. మానవులపై పరీక్షల అనంతరం తమ టీకా కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా డబుల్‌ ప్రొటెక్షన్‌ ఇవ్వగలదని ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుల బృందం చెప్పినట్లు యూకే మీడియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మెడికల్‌ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’ ఎడిటర్‌ ముందే సంకేతం ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. వ్యాక్సిన్‌ రేసులో ముందున్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా అధ్యయన ఫలితాలను ప్రకటించబోతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో వైద్యరంగంతో పాటు సామాన్యుల్లోనూ ఆ ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ‘రేపు.. వ్యాక్సిన్‌.. జస్ట్‌ సేయింగ్‌’ అంటూ లాన్సెట్‌ జర్నల్‌ ఎడిటర్‌ రిచర్డ్‌ హార్టన్‌ ఆదివారం ట్వీట్‌ (Tweets Lancet's Chief Editor) చేశారు. దీంతో జులై 20 నాటి సంచికలో ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఫేజ్‌-I క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను ఆ జర్నల్‌ ప్రచురిస్తారని అందరూ భావించారు.

కాగా భారత్‌కు చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధికి సంబంధించి ఒప్పందం చేసుకుంది. వచ్చే నెలలో భారత్‌లో మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తామని తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా సుమారు 140 పైగా పరిశోధనలు చేస్తుండగా.. వీటిలో 20 పైగా పరిశోధనలు ముందు వరుసలో ఉన్నాయి.