Islamabad, NOV 21: పాకిస్థాన్ లోని వాయువ్య జిల్లా కుర్రాంలో (Kurram) ప్యాసింజర్ వాహనాలపై సాయుధ దుండగులు గురువారం జరిపిన కాల్పుల్లో (Gunmen Open Fire On Passenger Vehicles) 50 మంది మరణించారు. వారిలో మహిళలు, పిల్లలు ఉన్నారు. మరో 29 మందికి గాయాలయ్యాయి. పెషావర్, పరాచినార్ మధ్య వెళుతున్న రెండు కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని సాయుధులు కాల్పులు జరిపారని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీం అసియం చౌదరి ఆరోపించారు. ఈ ఘటన అతిపెద్ద విషాదం అని పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పోలీసుల ఎస్కార్ట్ తో వస్తున్న రెండు వేర్వేరు కాన్వాయ్ లపై దుండగులు కాల్పులు జరిపారని సీనియర్ అధికారి జావెద్ ఉల్లా మెహ్సూద్ తెలిపారు.
సుమారు 10 మంది సాయుధ దుండగులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారన్నారు. పెషావర్ నుంచి పరాచినార్ మధ్య వెళుతున్న కాన్వాయ్ లో తన బంధువులు ఉన్నారని స్థానిక నివాసి జియారాత్ హుస్సేన్ తెలిపాడు. ఈ ఘటనను పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఖండించారు. పౌరులపై హింసను అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. షియా, సున్నీ ముస్లింల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న భూ వివాదం వల్లే ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు, దర్యాప్తు అధికారులు గుర్తించలేదు. ఏ సంస్థ కూడా తమదే బాధ్యత అని ప్రకటించుకోలేదు.