Islamabad, Nov 25: దాయాది దేశం పాకిస్తాన్‌లో అత్యాచారాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో కామంధులపై ఉక్కుపాదం మోపేందుకు ఇమ్రాన్ ఖాన్ రెడీ అయింది. దేశంలో పెరుగుతున్న అత్యాచార సంఘటనలను అరికట్టడానికి, "అత్యాచారం యొక్క నిర్వచనాన్ని మార్చే" రెండు అత్యాచార వ్యతిరేక ఆర్డినెన్స్‌లను (Pakistan Penal Code (Amendment) Ordinance 2020, Anti-Rape (Investigation & Trial) Ordinance 2020) పాకిస్తాన్ ఫెడరల్ క్యాబినెట్ మంగళవారం ఆమోదించింది.
రసాయన కాస్ట్రేషన్ (Chemical Castration Of Rapists) మరియు ఉరితో సహా రేపిస్టులకు ఆదర్శప్రాయమైన శిక్షను ప్రదానం చేయడమే ఈ బిల్లుల లక్ష్యంగా ఉంది. అయితే ఇది బహిరంగంగా కాకుండా సీక్రెట్ పద్దతిలో అమలు చేయనున్నారని డాన్ పత్రిక వెల్లడించింది.
ఇందులో భాగంగా రేపిస్టుల లైంగిక పటుత్వం తగ్గేలా ఆపరేషన్లు(కాస్ట్రేషన్) నిర్వహించడం సహా బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Pakistan Prime Minister Imran Khan ) ఆమోదం తెలిపారని స్థానిక చానెల్ జియో టీవీ వెల్లడించింది. మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో భాగంగా న్యాయ శాఖ ముసాయిదాను ప్రవేశపెట్టగా ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Here's Minister for Human Rights in PM Imran Khan's cabinet Shireen Mazari Tweet
CCLC will now finalise & it should become operational in next few days. Includes an expansive definition of rape, estab of special courts, Anti rape crisis cells, protection of victims & witnesses, prohibition of the "two-finger" test etc. These Ordinances were badly needed.
— Shireen Mazari (@ShireenMazari1) November 24, 2020
అత్యాచార నిరోధక కార్యాకలాపాల్లో అధిక సంఖ్యలో మహిళలను భాగస్వామ్యం చేయడం, సాక్షులకు రక్షణ కల్పించడం, త్వరితగతిన రేప్ కేసులు నమోదు వంటి అంశాలను డ్రాఫ్ట్‌కాపీలో చేర్చినట్లు తెలిపింది. ఇక పాకిస్తాన్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో కఠినమైన చట్టం తీసుకురావాల్సిందిగా ఇమ్రాన్ భావించారని, పౌరులకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, అదే సమయంలో వారి వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడతామని ఇమ్రాన్ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.
కాగా నూతన చట్ట రూపకల్పనలో భాగంగా.. లైంగిక దాడి కేసుల్లో దోషులను బహిరంగంగా ఉరితీయాలని కొంతమంది మంత్రులు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇందుకు సుముఖంగా లేని ఇమ్రాన్ ఖాన్, ప్రస్తుతానికి అలాంటి ఆలోచన వద్దని వారించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం లాహోర్‌లో ఏడేళ్ల బాలిక అత్యాచారం, హత్య, ఇటీవల ఓ మహిళపై సామూహిక లైంగికదాడి ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.