Pakistan PM Shehbaz Sharif. (Photo Credits: Twitter | ANI)

Pakistan Ready To Talk With India: భారత్, పాకిస్తాన్‌ మధ్య ఎప్పటి నుంచో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చల కోసం తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలే కీలమని.. యుద్ధం పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రెండు దేశాలు పేదరికం, నిరుద్యోగంపై పోరాడుతున్నాయని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ లో పాకిస్థాన్ మినరల్స్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఆర్థికంగా కుదేలైన దేశంలో విదేశీ పెట్టుబడుల కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో హెహబాజ్‌ మాట్లాడుతూ పాకిస్తాన్‌ కోలుకోవడం కోసం ఇరుగు పొరుగు దేశలన్నింటితోనూ తాము మాట్లాడతామని, పొరుగు దేశంతో యుద్ధం అనేది ఇక మార్గం కాదన్నారు. భారత్‌తో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కశ్మీర్‌ అంశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రేరేపిస్తూ ఉండడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్‌ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ లో బాంబు పేలుడు, 35 మంది మృతి, మీటింగ్ జరుగుతుండగా దుర్ఘటన, తీవ్రవాదుల హస్తం..

ఇదే సందర్భంలో భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాల చరిత్ర గురించి ప్రధాని ప్రస్తావించారు. యుద్ధాల ఫలితంగా పేదరికం, నిరుద్యోగం, విద్య, ఆరోగ్యం, ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతుందన్నారు. పాకిస్థాన్ ఓ అణ్వాయుధ దేశం. మా వద్ద ఉన్న అణ్వాయుధాలు కేవలం రక్షణ కోసమే. యుద్ధం కోసం కాదు. ఒక వేళ అణు యుద్ధమే జరిగితే.. ఏం జరిగిందో చెప్పడానికి ఆ తర్వాత ఎవరూ మిగిలి ఉండరు. అందువల్ల ఏ సమస్యకైనా యుద్ధం పరిష్కారం కాదు. అణు యుద్దం జరిగితే దాని విధ్వంసం ఏ విధంగా ఉంటుందో పాకిస్థాన్ కు తెలుసు. ఇదే విషయాన్ని భారత్ కూడా గ్రహించాలని పాక్ ప్రధాని షెహబాజ్ వ్యాఖ్యానించారు.

జమ్మూ మరియు కాశ్మీర్ ఎల్లప్పుడూ మా దేశంలో భాగమేనని భారతదేశం కూడా నొక్కి చెప్పిన సంగతి విదితమే. కాగా ఆగస్టు 12న పార్లమెంటు ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ సంకీర్ణ ప్రభుత్వం సమాయత్తమవుతున్న తరుణంలో ప్రధాని షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అసెంబ్లీ, దిగువ సభ, పదవీకాలం ముగియడానికి కొన్ని రోజుల ముందు తదుపరి ఎన్నికలకు మరింత సమయం ఇవ్వడానికి రద్దు చేయబడుతుందని భావిస్తున్నారు.