ఫిబ్రవరి 14, 2019 Pulwama attack తో భారత్ దిగ్బ్రాంతికి గురైంది. ఉగ్రవాదుల దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం యావత్ భారతావనిని కలిచివేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత్ తన నౌకా దళాన్ని (Indian Navy) రంగంలోకి దించింది, పాకిస్థాన్ ప్రాధేశిక ప్రాంతాలకు సమీపంలో అనేక యుద్ధ నౌకలు, సబ్-మెరిన్లను మోహరించింది. ఈ నేపథ్యంలో భారత్ ఖచ్చితంగా పుల్వామా దాడికి తమపై ప్రతీకారం తీర్చుకుంటుందని నిర్ధారణకు వచ్చిన పాకిస్థాన్ ముందుజాగ్రత్త చర్యగా కరాచీలో ఉన్న తమ యుద్ధ నౌకలను, జలాంతర్గాములు అన్నింటినీ వేరే ప్రాంతాలకు తరలించడం ప్రారంభించింది. అయితే ఇదే గ్యాప్ లో పాకిస్థాన్ ఊహకందకుండా భారత వైమానిక దళాలు పాక్ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డాయి, బాలాకోట్ లోని జైషే మహ్మద్ కీలక స్థావరాలను ధ్వంసం చేశాయి.
ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారా స్థాయికి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా సరిహద్దు వెంబడి భారత్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో పాటు, అంతర్జాతీయ వేదికపైనా పాక్ దుశ్చర్యలను ఎప్పటికప్పుడూ ఎండగడుతూ ఆ దేశాన్ని అన్ని విధాలుగా ఏకాకిని చేస్తుండటంతో పాకిస్థాన్ ఆత్మరక్షణలో పడిపోయింది. లోలోపల తీవ్ర ప్రతీకార భావంతో రగిలిపోతూ ఉన్నా, ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పాక్ ఉంది. తమ స్థావరాలపై దాడికి ప్రతిచర్యగా భారత వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఏకంగా 20 యుద్ధవిమానాలను పంపించి మరో తప్పు చేసి ఘోరంగా విఫలమైంది. ఆ దాడిలో పాక్ విమానాన్ని కూల్చి వారి ఆర్మీకి చిక్కినా కూడా తర్వాత భారత్ ఎలాంటి ప్రతిచర్యకు పూనుకుంటుందో అనే భయంతో అభినందన్ ను తిరిగి సురక్షితంగా భారత్ కు అప్పజెప్పింది.
ఈ వరుస పరిణామాలతో భారత్ - పాక్ మధ్య ఇప్పటికే ఓ అప్రకటిత యుద్ధం మొదలయ్యింది. సరిహద్దు వెంబడి పాకిస్థాన్ కదలికలను ఎప్పటికప్పుడు భారత్ ఓ కంట కనిపెడుతూ ఉంది, భారత శాటిలైట్లను పాకిస్థాన్ పోర్టులు, యుద్ధనౌకలు, సబ్ మెరెన్లపై కేంద్రీకరించారు. అయితే ఉన్నట్టుండి పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన PNS Saad అనే జలాంతర్గామి (Submarine) ఒకటి ఉన్నచోటు నుంచి మాయమైంది. ఈ PNS Saad జలాంతర్గామి మిగతా జలాంతర్గముల కంటే విభిన్నం. ఇది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపెల్షన్ అనే అత్యంత అధునాతన టెక్నాలజీ గల జలాంతర్గామి. పీడనాన్ని తట్టుకొని సుదీర్ఘకాలం నీటి లోపలే ఉండిపోగలదు. అది మాయమైన ప్రదేశం నుంచి కేవలం 3 రోజుల్లో గుజరాత్ తీరానికి, 5 రోజుల్లో ముంబై లోని కీలక నౌకాదళ స్థావరాలకు అది చేరుకోగలదు.
దీంతో ఇది అత్యంత ప్రమాదకరం అని భావించిన భారత్, వెంటనే అప్రమత్తమైంది. జలాంతర్గాములను గుర్తించి వాటిపై అప్పటికప్పుడే దాడి చేయగల సామర్థ్యం ఉన్న ప్రత్యేక యుద్ధ నౌకలను, పీ8-ఐ విమానాలను రంగంలోకి దించి గుజరాత్, మహారాష్ట్రాల పరిధిలో నిరంతరం విస్తృత గాలింపు చేపట్టింది. అయితే ఎక్కడా దీని జాడ కనిపించలేదు, మరోవైపు శాటిలైట్లు కూడా దీని గురించి ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వడం లేదు.
మరిప్పుడు ఈ జలాంతర్గామి ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? భారత్ కు ఇదో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీంతో అణుజలాంతర్గామి INS Chakra ను పాకిస్థాన్ జలాల వరకు తీసుకెళ్లి మరీ కాపలా పెట్టారు. రోజులు గడిచిపోతున్నా, సముద్రాన్ని జల్లెడ పడుతున్నా ఎంతకీ దీని జాడ తెలియరావడం లేదు. చివరగా అత్యధునికమైన, స్కోర్పిన్ తరగతికి చెందిన కల్వరి జలంతర్గామి (Scorpene-class submarine INS Kalvari) ని రంగంలోకి దించి తమ నిఘా పరిధిని విస్తరించుకుంటూ పోయారు. అయినప్పటికీ దీని జాడ తెలియరాకపోవడంతో పాకిస్థాన్ తమ PNS Saad జలాంతర్గామిని ఎక్కడో ఒకచోట దాచిపెట్టి ఉంటారని ఇండియన్ నేవీ ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చింది, మరోవైపు తమ గాలింపు మిషన్ ను అలాగే కొనసాగిస్తూ వచ్చింది. ఎట్టకేలకు 21 రోజుల విస్తృత గాలింపు తర్వాత దాని అచూకీ లభించింది. పాకిస్థాన్ కు పశ్చిమంగా ఒక చోట దానిని భద్రంగా దాచిపెట్టారు. భారత్ తో మరింతగా చెడితే ఏదైనా రహస్య మిషన్ ను చేపట్టేందుకు వీలుగా పాక్ ఆ జలాంతర్గామిని అక్కడ దాచిపెట్టినట్లుగా నేవీ అధికారులు భావిస్తున్నారు.