Karachi, Sep 27: రెండు వేర్వేరు దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 29 మంది మరణించారు. భారత్ కు పొరుగుదేశాలైన పాక్, చైనాలో ఈ రోజు ఘోర ప్రమాదాలు (Major Accidents in China & Pakistan) చోటు చేసుకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగి (Passenger bus catches fire in Pakistan) 13 మంది మృతి చెందారు. కరాచీ ఐజీ డాక్టర్ అఫ్తాబ్ పఠాన్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి కరాచీకి 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 13 మంది అక్కడికక్కడే సజీవదహనం కాగా.. మరో ఐదుగురి పరస్థితి విషమంగా ఉంది. ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.
కాలిపోయిన బస్సు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన తర్వాత శనివారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహన వేగం అధికంగా ఉండటంతో బోల్తా కొట్టిన వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇంధన ట్యాంకుకు వ్యాపించడంతో భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారని' పోలీసులు వెల్లడించారు.
ఇక పొరుగుదేశం చైనాలోని భూగర్బ బొగ్గు గనిలో పనిచేస్తున్న 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నైరుతి చైనాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్వేయర్ బెల్ట్ కాలిపోవడంతో పెద్ద ఎత్తున కార్బన్ మోనాక్సైడ్ విడుదలైందని (Carbon Monoxide Poisoning In Chinese Coal Mine), దీంతో గనిలో పనిచేస్తున్న 16 మంది ఊపిరాడక మృతి చెందారని చైనా అధికారిక వార్తా సంస్థ జింగ్వా పేర్కొంది. ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదని తెలిపింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని గిజియాంగ్ జిల్లా యంత్రాంగం సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా, ప్రమాదం జరిగిన చోఘింగ్ ఎనర్జీ సంస్థ ప్రభుత్వం అధీనంలో నడుస్తోంది.
ఇదిలా ఉంటే చైనాలో బొగ్గు గనుల్లో ప్రమాదాల సాధారణమైపోయాయి. భద్రతా పరమైన నిఘా లేకపోవడం, అధికారుల వైఫల్యం కారణంగా ఎంతోమంది అమాయకులు, మైనర్లు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. గత డిసెంబర్‌లో జరిగిన ఓ బొగ్గుగని, గ్యాస్ పేలుడు ఘటనలో 14 మంది మైనర్లు మృతి చెందారు. 2018 డిసెంబర్‌లో ఇదే చోఘింగ్ ఎనర్జీ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మైనర్లు మృతి చెందారు. 2018 అక్టోబర్‌లో షాన్‌డోంగ్ జిల్లాలో జరిగిన మరో బొగ్గు గని ప్రమాదంలో 21 మైనర్లు ప్రాణాలు విడిచారు. బొగ్గు పెళ్లలు విరిగిపడంతో బయటకు రాలేక 22 మంది చిక్కుకు పోగా.. ఒకరిని మాత్రమే రక్షించగలిగారు.