Delhi Airport statement: 32 flights diverted from IGI airport airport due to low visibility (Photo-ANI)

New Delhi November 13: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ప్రజలు మధ్యాహ్నం వరకు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత వాయుకాలుష్యం ఉన్న నగరాల్లో తొలిస్థానంలో ఢిల్లీ ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. భారత్‌ నుంచి మరో రెండు నగరాలు కూడా ఈ లిస్ట్‌లోకి చేరాయి.

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీపావళి తర్వాత నుంచి పరిస్థితి మరింత దిగజారుతూ వస్తుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నా మాస్క్‌ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచి.. చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ జాబితాలో భారత్ నుంచి ముంబై, కోల్‌కతా కూడా చేరాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన క్లైమేట్‌ గ్రూప్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్‌ గాలి నాణ్యత, కాలుష్యాన్ని పర్యవేక్షిస్తుంటుంది. టాప్‌-10 జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్‌, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పాటూ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. శివారు ప్రాంతమైన నోయిడాలో వాయునాణ్యత సూచీ 772 గా ఉంది. ఇక నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఇండెక్స్‌ 476గా నమోదైంది. గాలి నాణ్యంగా ఉండాలంటే పీఎం 2.5 స్థాయి క్యూబిక్‌ మీటరుకు 60 మైక్రోగ్రాములుండాలి. కానీ ఢిల్లీలో ప్రస్తుతం ఆరు రెట్లు ఎక్కువగా కాలుష్యం ఉన్నది.