Beijing, May 8: కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా (China Coronavirus) అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (China’s President Xi Jinping) దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తూనే ఉందని.. కాబట్టి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. 2 లక్షల అరవై వేలకు చేరువలో మృతులు, ప్రపంచవ్యాప్తంగా ముఫ్పై ఏడు లక్షలకు పైగా కరోనా కేసులు, యుకెలో 12 లక్షల దాటిన కరోనా కేసులు
కోవిడ్-19 (Covid-19) నివారణ, నియంత్రణ చర్యల సెంట్రల్ గైడింగ్ గ్రూపు సమావేశంలో జిన్‌పింగ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు మాట్లాడుతూ కరోనా సంక్షోభం నేపథ్యంలో బాహ్య ప్రపంచం నుంచి ఎదురయ్యే ప్రతికూల సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలన్నారు. హుబేలో మహమ్మారి నియంత్రణ, నివారణ చర్యలు కొనసాగించాలని, జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనే అల్ప సంతోషం వద్దని పేర్కొన్నారు.
చైనా వుహాన్ నగరం (China Wuhan) సహా ఇతర కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తివేసిన క్రమంలో జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వుహాన్‌లో ఇప్పటికే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కాగా.. మరికొన్ని చోట్ల గురువారం నుంచి ఫ్యాక్టరీలను తెరిచారు. ఇక మే 7 నాటికి చైనాలో రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్ (National Health Commission (NHC) వెల్లడించింది. కరోనా సోకిన ఆ ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారేనని పేర్కొంది. స్థానికంగా ఒక్క కేసు కూడా బయటపడలేదని తెలిపింది. మెత్తంగా దేశంలో మొత్తం ఇప్పటిదాకా 82,885 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా... కరోనా లక్షణాలు లేకున్నా బుధవారం నాటికి ఆరుగురు వ్యక్తులకు వైరస్ సోకినట్లు తేలిందని హుబే ఆరోగ్య కమిషన్ వెల్లడించడం గమనార్హం. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ ఇదేనా?, శుభవార్త చెప్పిన ఇటలీ, ఎలుకలపై కరోనా వ్యాక్సీన్ ప్రయోగం విజయవంతమయిందని ప్రకటన, వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్
ఇదిలా ఉంటే మాస్కో నుంచి బీజింగ్‌కు వచ్చేందుకు ప్రయాణికులను అనుమతించింది. అయితే చైనా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించేవారు విధిగా న్యూక్లిక్ యాసిడ్ టెస్టు(ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ) ఫలితాల వివరాలు తమకు సమర్పించాలని పేర్కొంది. సదరు పరీక్షలో నెగటివ్ ఫలితాలు వచ్చిన వారే తమ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించేందుకు అర్హులని షరతు విధించింది.మే 8 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని... ప్రయాణానికి 120 గంటల ముందు టెస్టు వివరాలు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.