New Delhi, July 09: గతేడాది ఉక్రెయిన్‌పై (Ukraine War) యుద్ధానికి దిగిన రష్యా ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి అమెరికా, ఈయూ దేశాలు నిరాకరించాయి. కానీ దీర్ఘకాలంలో అవసరాల కోసం రూట్ మార్చాయి. యుద్ధం సాగుతున్న వేళ.. రష్యా సైతం రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన మనీ కోసం భారత్‌కు బ్రెంట్ క్రూడాయిల్ (Russia Oil) ధరతో పోలిస్తే 30 డాలర్లకు పైగా డిస్కౌంట్ ధరకే బ్యారెల్ ముడి చమురు సరఫరా చేస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు బ్యారెల్ ముడి చమురుపై భారత్‌కు రష్యా ఇస్తున్న డిస్కౌంట్ నాలుగు డాలర్లకు తగ్గిపోతుందని తెలుస్తున్నది. మరోవైపు ఇండియాకు ముడి చమురు సరఫరా చేస్తున్న రష్యా చమురు రవాణా సంస్థలు మాత్రం భారీగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. రష్యా ముడి చమురుపై డిస్కౌంట్ తగ్గడం, రవాణా చార్జీలు ఎక్కువగా ఉండటంతో భారత్ మార్కెట్లో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petro Price Hike) పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా, ఈయూ దేశాల నియంత్రణ వల్ల భారత దేశానికి రష్యా బ్యారెల్ (Russia Oil) చమురు ధర 60 డాలర్ల కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నది. కానీ, బాల్టిక్, నల్ల సముద్రం నుంచి భారత్ కు చేర్చడానికి బ్యారెల్ మీద 11-19 డాలర్ల మేర రవాణా చార్జీల భారం పడుతుంది. ఇది మార్కెట్ ధర కంటే ఎక్కువ.
ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రారంభించక ముందు మొత్తం దేశీయ అవసరాల్లో రెండు శాతం ముడి చమురు మాత్రమే కొనుగోలు చేసిన భారత్ ముడి చమురు సంస్థలు తర్వాత దాన్ని 44 శాతానికి పెంచాయి. ఈ చమురు కొనుగోళ్ల కోసం కేంద్ర చమురు సంస్థలు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ప్రభుత్వ రంగ ముడి చమురు సంస్థలు రష్యా నుంచి 60 శాతం ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి.