PM Modi Meeting with Putin (Photo-File Image)

PM Modi Meeting with Putin: భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం (PM Modi Russia Visit) ఆయ‌న సోమ‌వారం ర‌ష్యా వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ప్రధాని మోదీ కౌగిలించుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. రష్యా (Russia)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రెండో రోజైన ఇవాళ ఆయన (PM Narendra Modi) మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

తాను ఒక్కడినే ఇక్కడికి రాలేదని.. 140 కోట్ల మంది ప్రేమను తీసుకొచ్చానని తెలిపారు. భారతదేశ మట్టి వాసనను మోసుకొచ్చినట్లు చెప్పారు. ఇటీవలే మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశానన్న మోదీ.. మూడు రెట్లు వేగంగా పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతానని ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. భారత్‌ ఘనత ప్రపంచం గుర్తించకతప్పని పరిస్థితి తెచ్చామని వ్యాఖ్యానించారు.  ప్ర‌పంచంలోని అతిపెద్ద‌ క్రిమిన‌ల్‌ పుతిన్‌ను ప్రధాని మోదీ కౌగిలించుకోవ‌డం బాధగా ఉంది, ఆవేదన వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ

‘ఏ దేశానికీ సాధ్యంకాని విధంగా చంద్రయాన్‌ ప్రయోగం చేపట్టి విజయం సాధించాం. చంద్రుని దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందాం. దేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తిస్తోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులు దేశాన్ని చూసి గర్విస్తున్నారు. డిజిటల్‌ పేమెంట్లలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించాం. స్టార్టప్‌ల్లో ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకున్నాం. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయి. భారత్‌ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా వ్యవస్థ భారత్‌లో ఉంది.

భారతదేశం మారుతోందని ప్రపంచమంతా గుర్తించింది. గత 10 ఏళ్లలో భారత్‌ సాధించిన అభివృద్ధి వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించాం. పదేళ్లలో 40 వేల కి.మీ. ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేశాం. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్‌ చేశాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించాం. అభివృద్ధిలో 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉంది. టీ20 వరల్డ్ కప్ గెలిచి దేశం సంబరాలు చేసుకుంది. భారత్‌ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తెచ్చాం. దేశంలోని ప్రతీ ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాం. ఆత్మవిశ్వాసం భారత దేశానికి అతిపెద్ద ఆయుధం. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్ఠమైనది’ ’ అంటూ మోదీ చెప్పుకొచ్చారు

ఇటీవల టీమ్‌ఇండియా టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన సందర్భాన్ని మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. గెలుపు కోసం వారు పడిన ఆరాటం.. అందుకు సాగించిన ప్రయాణమే వారి విజయం వెనుక ఉన్న అసలు కథ. ఈ రోజుల్లో యువత చివరి క్షణం (చివరి బంతి) వరకు ఓటమిని అంగీకరించడం లేదు. అలా ముందుకుసాగే వారినే విజయం వరిస్తుంది’’ అని రోహిత్‌ సేనను ప్రధాని కొనియాడారు. అలాగే మన ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడంతో సినిమాలది కీలక పాత్ర అని చెప్పారు. ఈ సందర్భంగా అలనాటి ప్రముఖ నటులు రాజ్‌కపూర్‌, మిథున్‌ చక్రవర్తి ప్రస్తావన తీసుకొచ్చారు. వారి సినిమాలు రష్యాలో ప్రజాదరణ పొందాయని చెప్పారు.

రష్యాతో వాణిజ్య, పర్యటక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. రష్యాలోని కజాన్‌, యెకాటీరీన్‌బర్గ్‌ నగరాల్లో కొత్తగా రెండు భారత కాన్సులేట్‌లను ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు. యెకాటీరీన్‌బర్గ్‌ రష్యాలో నాలుగో అతిపెద్ద నగరం. ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా ఉద్భవించింది. 2018లో రష్యాలో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌లో పలు మ్యాచ్‌లు ఇక్కడ నిర్వహించారు. మరోవైపు.. వోల్గా, కజాంకా నదుల సంగమం వద్ద ఉన్న కజాన్.. సాంస్కృతిక, విద్యాకేంద్రంగా విలసిల్లుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో కజాన్‌లోనే బ్రిక్స్ సదస్సును నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో భారత్‌కు రెండుచోట్ల కాన్సులేట్‌ (సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, వ్లాడివోస్టాక్‌)లు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఆయన తీవ్రవాదంపై నిప్పులు చెరిగారు. గత 40-50 సంవత్సరాల నుంచి భారతదేశం ఈ క్రూరత్వాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఉగ్రవాదం అనేది ఎంతో భయంకరమైందని చెప్పారు. అందుకే.. మాస్కోలో (Moscow) గానీ, డాగేస్తాన్‌లో (Dagestan) గానీ ఉగ్ర సంఘటనలు జరిగినప్పుడు.. ఆ బాధ ఎంత తీవ్రమైందో తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు.

యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా.. మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణనష్టం జరిగినప్పుడు ఎంతో బాధ కలుగుతుందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. అమాయక పిల్లలు చనిపోవడం చూస్తే గుండె తరుక్కుపోతుందని, ఆ బాధ మాటల్లో వర్ణించలేనిదని తెలిపారు. దీనిపై ఇదివరకే మీతో (పుతిన్‌ని ఉద్దేశిస్తూ) చర్చించానని ఆయన గుర్తు చేశారు. తాను అన్ని రకాల ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నానని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌తో యుద్ధం అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు. ఎలాంటి సమస్యలైనా పరస్పర దాడులతో, యుద్ధంతో పరిష్కరించలేమని.. చర్యలు, దైత్యమే మార్గాలని సూచించారు.

శాంతియుత పరిష్కారాన్ని భారతదేశం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తుందని.. దీనిపై మీరు (పుతిన్‌ని ఉద్దేశిస్తూ) సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయమని ప్రధాని మోదీ చెప్పారు. శాంతియుత వాతావరణానికి భారత్ కట్టుబడి ఉందని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నానని అన్నారు. తన మిత్రుడైన పుతిన్ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారని, ఆయన ఆలోచనలు కూడా సానుకూలంగానే ఉన్నాయని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు.