New Delhi, Feb 25: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (India to Evacuate Citizens From Ukraine ) కీలక ప్రకటన చేసింది. హంగేరి, రుమేనియా దేశాలకు (Hungary, Romania) దగ్గరగా ఉన్న వారు సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్దకు రావాలని సూచించింది. ప్రయాణించే సమయంలో తమ వాహనాలపై ఇండియన్ ఫ్లాగ్‌ను పెట్టుకోవాలని కోరింది. భారతీయుల తరలింపు కోసం గురువారం రాత్రి నుంచి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హంగరీ, స్లోవేవకియా, రుమోనియా దేశాలకు చెందిన ప్రభుత్వాలతో చర్చలు జరిపారు.
భారతీయుల తరలింపుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయా దేశాలు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెంటనే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో విద్యార్థులంతా ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని హుజూర్ద్, చెర్నీ వెస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలని తెలిపింది. స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులంతా టీమ్‌లుగా బయల్దేరాలని సూచించింది. బోర్డర్ వచ్చే ముందు పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోవాలని కోరింది. బోర్డర్ దాటే సమయంలో ఇబ్బందులు రాకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ల ఏర్పాటు చేశారు.
ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్లు వారికి సహకరిస్తాయి. రుమేనియా రాజధాని బుచరెస్ట్‌కి 2022 ఫిబ్రవరి 26న రెండు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు పంపిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పశ్చిమ ప్రాంతంలో ప్రస్తుతం విద్యార్థులు ఉన్న స్థావరాల దగ్గర ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు చేశారు.